
- భూవివాదాలు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- సింగపూర్‌లో మాదిరి నైట్ సఫారీలు
- అటవీ శాఖ కెమెరాలు ఐసీసీసీతో అనుసంధానం
- ప్రమోషన్లు, అవార్డులు, ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని సూచన
- అటవీ శాఖ అధికారులతో సీఎం సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూవివాదాలను పరిష్కరించేందుకు జాయింట్ సర్వే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అటవీ శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘రెవెన్యూ, అటవీ శాఖల మధ్య తరుచూ భూవివాదాలు వస్తున్నాయి. రెండు శాఖల అధికారులు కలిసి రికార్డుల ప్రకారం సర్వే నిర్వహిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలి” అని అధికారులను ఆదేశించారు. ‘‘సింగపూర్ వంటి దేశాల్లో కేవలం 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయి.
మన రాష్ట్రంలో విస్తారమైన అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి. రాష్ట్రంలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లు ఉన్నప్పటికీ.. ప్రజలు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. అమ్రాబాద్, కవ్వాల్‌కు టూరిస్టులు పెరిగేలా సౌలతులు కల్పించాలి” అని సూచించారు. అడవుల్లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి కదలికలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలన్నింటినీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో చేపడ్తున్న అభివృద్ధి పనులకు అనుమతుల విషయంలో అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్యమైనంత త్వరగా సాధించాలన్నారు.
బాధితులకు తక్షణమే పరిహారం..
అటవీ జంతువుల దాడిలో మరణించిన లేదా గాయపడినోళ్లకు, అలాగే పశువులు, పెంపుడు జంతువులు కోల్పోయినోళ్లకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అవసరమైన నిధులను వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్‌లోని కాకతీయ జూ పార్క్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో జూను అభివృద్ధి చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ఉత్తమ సిబ్బందికి అవార్డులు..
అటవీ శాఖలో అధికారుల కొరతపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్‌ఎస్ అధికారులను కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని సీఎస్‌కు సూచించారు. శాఖలో ప్రమోషన్లు, కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వారికి అవార్డులు ఇచ్చే ప్రక్రియను పునరుద్ధరించాలని సూచించారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, పీసీసీఎఫ్ సువర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఎలుసింగ్ మేరు తదితరులు పాల్గొన్నారు.