బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్ బాచుపల్లిలో రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.  

మే 7వ తేదీ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు కూలీలు చనిపోయారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలి సెంట్రింగ్ కార్మికుల షెడ్ పై పడింది. దీంతో ఏడుగురు కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. వీరిని  హాస్పిటళ్లకు తరలించారు. 

మృతుల్లో ఇద్దరు మహిళలు, 4 ఏళ్ల బాబు ఉన్నారు. పోలీసులు, GHMC, NDRF సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీశారు. మృతి చెందిన కార్మికులను ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కూకట్ పల్లి ACP శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం తీరుపై ఆరా తీశారు.   ఘటనపై బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.