సింగిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ రూపొందించండి: CM రేవంత్ ఆదేశం

సింగిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ రూపొందించండి: CM రేవంత్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ కోర్ అర్బన్ రీజియ‌న్ ప‌రిధిలో చేపట్టే వివిధ ర‌కాల నిర్మాణాలు, ఇత‌ర స‌దుపాయాల క‌ల్పన‌కు సంబంధించిన పౌర సేవలు, అనుమ‌తుల ప్రక్రియ సరళంగా, సుల‌భ‌త‌రంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి సమగ్ర అధ్యయ‌నంతో సాధ్యమైనంత త్వర‌గా నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియ‌న్ ప‌రిధిలో పౌర సేవ‌లు, అనుమ‌తుల‌ మంజూరు వంటి అంశాలపై బుధవారం (మే 14) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వహించారు.

ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలోని కోర్ అర్బన్ రీజియ‌న్‌లో వివిధ ర‌కాల నిర్మాణాల‌కు ప్రజ‌లు ప‌లు విభాగాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకొని ఆయా కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాట్‌ఫామ్‌పై దరఖాస్తు చేసుకుని సింగిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. ఇందుకు రెవెన్యూ, పుర‌పాల‌క‌, జ‌ల వ‌న‌రులు, నీటి స‌ర‌ఫ‌రా, మురుగు నీటి పారుద‌ల‌, పోలీసు, అగ్నిమాప‌క, విద్యుత్‌ త‌దిత‌ర విభాగాలు సంయుక్తంగా ప‌ని చేయాల‌ని ముఖ్యమంత్రి సూచించారు. ఆయా శాఖ‌లు వ‌సూలు చేసే బిల్లులు సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలన్నారు.

వినియోగ‌దారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జ‌మయ్యే విధానాన్ని రూపొందించాల‌న్నారు. ఈ క్రమంలో ఆస్తులు, వ‌న‌రుల గుర్తింపున‌కు లైడార్ స‌ర్వే చేయాల‌ని, మ‌రింత సుల‌భ‌త‌ర విధానాల అధ్యయ‌నానికి నిపుణుల స‌ల‌హాలు తీసుకోవాల‌ని సూచించారు. అనుమ‌తుల ప్రక్రియ‌లో అన‌వ‌స‌ర‌మైన‌ జాప్యం జరగరాదని, ఏ కార‌ణం లేకుండా అనుమ‌తులను నిరాక‌రించ‌డానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఏదైనా కార‌ణం చేత అనుమ‌తులకు ఆల‌స్యమైతే వివరాలను ద‌ర‌ఖాస్తుదారుడి తెలియ‌జేసి వాటి ప‌రిష్కారానికి మార్గాలను కూడా అధికారులే సూచించాల‌ని ఆదేశించారు. ఈ స‌మీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.