2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి.. అప్పటి వరకు నేనే సీఎం

2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి.. అప్పటి వరకు నేనే సీఎం

2034 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించి  జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి.   అప్పటి వరకు  తానే  సీఎంగా కొనసాగుతానని చెప్పారు.జాతీయ రాజకీయాల్లోకి  వెళ్లి  రాహుల్ గాంధీ తర్వాతి  స్థానంలో ఉండాలన్నదే తన లక్ష్యమని  అన్నారు. 

సోనియా, రాహుల్,ప్రియాంక గాంధీలతో తనకు ఉన్న చొరవ ఉందని.. వారి వద్ద తన మాట చెల్లుతుందన్నారు రేవంత్ .  రాహుల్ గాంధీకి నిజానికి ప్రధాని కావాలనే కోరిక లేదని, కానీ దేశం కోసం ఆ బాధ్యత తీసుకోవాలని తానే ఆయనను ఒప్పించినట్లు రేవంత్ వెల్లడించారు.  దేశంలో  కాంగ్రెస్ అధికారంలోకి  తీసుకురావడమే రాహుల్ గాంధీ లక్ష్యమని అన్నారు రేవంత్. 

బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై రేవంత్   కీలక వ్యాఖ్యలు చేశారు. కొడుకు మీద కేసు నమోదైతే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలా? అని  సీఎం రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి హోదాలో ఉండి.. హుందాగా వ్యవహరించాల్సిన అవసరం సంజయ్‌పై ఉందన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయడం కంటే చట్టం ముందు వాస్తవాలను తేల్చుకోవాలని  రేవంత్  సూచించారు.బండి సంజయ్ విచారణకు సహకరించాలని, ఆయన తన కొడుకును తీసుకుని స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వస్తేనే ఆయనకు గౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణను ఎదుర్కోకుండా ఉండటం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.