త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

త్వరలోనే 15 వేల పోలీసు  ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 లక్షల  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే భాద్యత తనదేన్నారు.  ఎల్బీ స్టేడియంలో 9,656మందికి స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి...త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.    ఆతర్వాత అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది నిరుద్యోగుల పాత్ర ఉందన్నారు రేవంత్ రెడ్డి.  నిరుద్యోగుల త్యాగాల పునాదులపై ఈ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ రోజు ఎంతో సంతోషమైన రోజు.. అప్పులు ఉన్నా..ఆర్థిక భారమైనా ఉద్యోగాలిస్తున్నామని చెప్పారు.   గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.  ఎంపీగా కవిత ఓడితే.. కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చాడు కానీ నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఆలోచించలేదని మండిపడ్డారు. తన  కుటుంబ ఉద్యోగాల గురించే గత ప్రభుత్వ ఆలోచన చేసింది కానీ నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు. 

ఉద్యోగాలిస్తుంటే బీఆర్ఎస్ కు కడుపు మండుతోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఇచ్చే వీడియోను కేసీఆర్, హరీశ్ రావులకు పంపించాలని కోరారు.   పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగదు..పొట్టోడిని పొడుగోడు కొడితే..పొడుగోడుని పోచమ్మ కొట్టిందంట అని రేవంత్ హరీశ్ పై సెటైర్లు వేశారు.