నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిన్ను, నీ పార్టీని అధికారంలోకి రానివ్వ: కేసీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్

నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం నిన్ను, నీ పార్టీని అధికారంలోకి రానివ్వ: కేసీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్
  • ఇదే నా శపథం.. కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరిక
  • దేనిపైనైనా అసెంబ్లీలో చర్చకు సిద్ధం.. దమ్ముంటే రా 
  • ఫ్యూచర్​ సిటీ కడ్తామంటే తొక్క తోలు అంటవా?.. మేం మాట్లాడ్తే 
  • నడుముకు రాయి కట్టుకొని మల్లన్నసాగర్​లో దుంకి సచ్చిపోతవ్​
  • ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్​ ట్యాప్​ చేయిస్తడా? సిగ్గుండాలె
  • కేటీఆర్​.. నీ స్థాయెంత? ఎక్కువ మాట్లాడితే లాగులో తొండలు ఇడుస్తం
  • 2029లోనూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని ధీమా
  • వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి అన్ని సర్కార్​ స్కూళ్లలో 
  • బ్రేక్​ ఫాస్ట్​, మిడ్​ డే మీల్స్​ అమలు చేస్తామని ప్రకటన
  • కోస్గిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మానం

మహబూబ్​నగర్​, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్​, బీఆర్​ఎస్​ చరిత్ర ఇక గతమేనని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వబోనని చెప్పారు. ‘‘2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తిరిగి అధికారంలోకి వస్తుంది. 2/3 మెజార్టీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తం. కాలకూట విషం లాంటి కేసీఆర్​ కుటుంబాన్ని నేను రాజకీయంలో ఉన్నంత కాలం అధికారంలోకి రానివ్వ. ఇదే నా శపథం.. ఇదే నా సవాల్” అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్​ బయటకు వచ్చి.. అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇస్తారనుకుంటే సోయిలేని మాటలు మాట్లాడ్తున్నారని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.  నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం మధ్యాహ్నం కొడంగల్​ నియోజకవర్గంలోని కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొని.. కోస్గి, మద్దూరు, గుండుమాల్​, కొత్తపల్లి, కొడంగల్​, దౌల్తాబాద్​, బొంరాస్​పేట, దుద్యాల మండలాల్లోని 180 మంది సర్పంచులను ఒక్కొక్కరిని స్టేజీ మీదికి పిలిచి సన్మానించారు. వారితో కలిసి గ్రూప్​ ఫొటో దిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

వాళ్లతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు

తెలంగాణలో బీఆర్​ఎస్​కు, కల్వకుంట్ల ఫ్యామిలీకి భవిష్యత్​ లేదని.. వాళ్ల నుంచి భవిష్యత్​ తెలంగాణకు ఒరిగేదేమీ లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్​ పార్టీయేనని చెప్పారు. ‘‘రాష్ట్రంలో 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తాం. అప్పటివరకు ప్రస్తుతం ఉన్నట్లే 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే 80 సీట్లను సాధిస్తాం. లేదా నియోజకవర్గాల పునర్విభజనతో 153 సీట్లకు పెరిగితే వంద సీట్ల మెజార్టీతో తెలంగాణలో రెండో సారి కాంగ్రెస్​ పార్టీని  అధికారంలోకి తీసుకొస్తా. ఇదే నా సవాల్​​. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు, దయాకర్​రావు, వినోద్​రావు.. రాసి పెట్టుకోండి. 2029లోనూ కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. మీకు చేతనైతే కాస్కోండి. మీ రాజకీయం చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం.. కేసీఆర్​ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. ఇదే నా శపథం. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్​ కుటుంబానికి అధికారం రావడమనేది ఇక కలే. బీఆర్ఎస్​ పార్టీ, కేసీఆర్​ చరిత్ర ఇక గతమే” అని తేల్చిచెప్పారు. 

ఫామ్​ హౌస్​నే బందీఖానా చేసుకున్నడు

రెండేండ్ల తర్వాత కేసీఆర్​ ఫామ్​ హౌస్​ నుంచి బయటకు వచ్చారని, తనుకున్న అనుభవంతో మంచి మాటలు చెబుతారనుకుంటే ‘నీ తోలు తీస్తా’ అని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్​ నా మీద 181 కేసులు పెట్టి చంచల్​ గూడ, చర్లపల్లి జైలులో బంధించిండు. నా కుటుంబాన్ని బాధించి, నన్ను ఎన్నో రకాలుగా సతాయించిండు. కానీ దానిని మనసులో పెట్టుకొని పగ సాధించడం మొదలుపెడ్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించిన. ‘కేసీఆర్​ ఆయన పాపాన ఆయనే పోతడు. మనం మంచి పని చేయాలి’ అనుకొని ముందుకు పోతున్నం. ఆయన చేసిన తప్పులకు దేవుడే ఆయనను శిక్షించిండు. నేను సీఎంగా ప్రమాణం చేసిన రోజే ఆయన కింద పడి నడుము ఇరిగింది. ఆయన ఫామ్​హౌస్​నే బంధీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్టు చేసి చర్లపల్లి. చంచల్​గూడకు పంపించినా ఇదే అయితది. ఇంకా ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆయన హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకున్నరు. కేసులు పెట్టి హింసించిన్రు. ఇవన్నీ పైన దేవుడు చూస్తున్నడు. వాళ్లు చేసిన పాపాలన్నిటినీ మిత్తీతో సహా తీరుస్తడు” అని పేర్కొన్నారు.  

కమీషన్ల కోసం పాలమూరును ఎడారి చేసిండు

‘‘ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. తెలంగాణ వస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అందరం అనుకున్నం. కానీ తెలంగాణ వచ్చినంక కేసీఆర్​ పదేండ్లు అధికారంలో ఉండి కృష్ణా బేసిన్​లో ప్రాజెక్టులను పట్టించుకోలేదు. నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్, కల్వకుర్తి  ప్రాజెక్టులను, ఆర్డీఎస్​, తుమ్మిళ్ల, మక్తల్, కొడంగల్​, నారాయణపేట జీవో 69ని పక్కన పెట్టి అన్యాయం చేసిండు. కొడంగల్​కు నీళ్లు రానివ్వలేదు. పాలమూరు ఎడారిగానే ఉండిపోయింది. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. కానీ 1.83 లక్షల కోట్లను పదేండల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. వేల కోట్ల కమీషన్లు కొట్టేసిండు”అని సీఎం రేవంత్​రెడ్డి ఫైర్​ అయ్యారు. 

తెగిన చెప్పులతో తిరిగినోళ్లకు 
వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్​?

కేసీఆర్​ కుటుంబంలోని వ్యక్తులకు వేల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘గతంలో తెగిన చెప్పులతో తిరిగినోళ్లకు ఇప్పుడు బెంజికార్లు ఎక్కడికెంచి వచ్చినయ్​? ఒకరికి ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్​హౌస్​, ఇంకొకరికి జన్వాడలో వంద ఎకరాల్లో ఫామ్​ హౌస్, అల్లుడికేమో మెయినాబాద్​లో ఫామ్​ హౌస్​.. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినయ్​? టీవీ చానళ్లు, పేపర్లు, వేల కోట్ల వ్యాపారాలు ఎట్ల వచ్చినయ్​?.. వాళ్లకన్నీ వచ్చినయ్​ కానీ.. ఉమ్మడి పాలమూరుకు కృష్ణా నీళ్లు రాలేదు” అని తెలిపారు. కేసీఆర్​ తీరును పదేండ్లు చూసిన జనం కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టులను ఒక్కొక్కిటిగా పరిష్కరిస్తున్నామని.. కొత్త వాటికి అనుమతులు సాధిస్తున్నామని పేర్కొన్నారు.

అసెంబ్లీలో ముఖాముఖి చర్చిద్దాం.. రా..

‘‘కేసీఆర్​.. పదేండ్లు నువ్వు చేసిన అభివృద్ధి, రెండేండ్లలో మా ప్రభుత్వం చేసిన డెవలప్​మెంట్​పై ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ముఖాముఖి చర్చించుకుందాం రా..’’ అని సీఎం రేవంత్​ సవాల్​ విసిరారు. ‘‘నిన్ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టినం. పార్లమెంట్​ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. కంట్మోన్మెంట్​ బై ఎలక్షన్​లో బండకేసి కొట్టినం. జూబ్లీ హిల్స్​ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్​ ఎన్నికల్లోనూ 12,726 స్థానాల్లో 8,335 మంది కాంగ్రెస్​ మద్దతుదారు లను గెలిపించుకున్నం. నిన్ను, నీ పార్టీని ఇంత ఓడగొట్టినా సిగ్గురావడం లేదా? ఊకదంపుడు ఉపన్యాసాలు పక్కన పెట్టు! కేసీఆర్.. మీ వయసుకు గౌరవం ఇస్తం. నీ అనుభవానికి గౌరవ ఇస్తం. 29వ తేదీ నుంచి అసెంబ్లీలో చర్చలు రాబోతున్నాయి. మీరు అడిగినన్ని రోజులు సభ జరుపుకుందాం. నువ్వు చెప్పినవన్నీ చర్చిద్దాం. వెనక మాట్లాడి వెనక్కి ఉర్కుడు కాదు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏ అంశం మీదైనా నేను చర్చకు సిద్ధం. సమస్యల మీద మాట్లాడదాం. మీరు అసెంబ్లీకి రండి. ఫామ్​హౌస్​లో పడుకుంటే కాదు. పది మంది చెంచాగాళ్ల ముందు పొంకనాలు కొట్టుడు కాదు. ఎన్నికలు ముగిసినయ్​. ఎవరు ఏం మాట్లాడుతున్నరో ప్రజలు గమనిస్తున్నరు” అని పేర్కొన్నారు.  

పదేండ్లు పాలమూరును పగబట్టినవ్​

‘‘మేం రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం ఫ్యూచర్​ సిటీ కడుతామంటే తొక్క తోలు అంటవా? వాడెవడో వంతారా.. బొంతారా అంటవా? ఒక మాజీ సీఎం స్థాయి వ్యక్తి ఇట్లనేనా మాట్లాడేది? మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీరి చింతకు కట్టి చింతమడకలో వేలాడేసి కొడ్తరు. కొడంగల్ వస్తావా? మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా? సోయి లేని మాటలు మాట్లాడుతున్నవ్. ఒక్కటైన అక్కరకొచ్చే మాటలు మాట్లాడినవా? పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నల్గొండ, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీళ్లు కృష్ణా నీటితో సస్యశ్యామలం అయ్యేవి. నువ్వు పదేండ్లు పాలమూరును పగబట్టినవ్​. ఇక్కడి ప్రాజెక్టులను పడావ్​ పెట్టినవ్​​” అని కేసీఆర్​పై రేవంత్​రెడ్డి ఫైర్ అయ్యారు. నారాయణపేట, మక్తల్​, కొడంగల్​ నియోజకవర్గాలకు సాగునీరు కావాలని ఊరూరా ఎత్తిపోతల పథకం కోసం 69 జీవో కోసం కొట్లాడితే కేసీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారని నిలదీశా రు. మర్యాద ఉండదనే ఇన్ని రోజులు మాట్లాడలేదని, తాము మాట్లాడితే నడుముకు రాయి కట్టుకొని మల్లన్నసాగర్​లో దూకి సస్తావని,  రంగనాయకసాగర్​లో మెడకు తాడు వేసుకొచి సస్తావని కేసీఆర్​ను హెచ్చరించారు. ‘‘నన్ను గెలక్కు. నేను అన్నీ చూసినా. నల్లమల అడవుల నుంచి వచ్చిన” అని అన్నారు.  

సంతకుపోయి బర్రెలు కాస్కో

‘‘కృష్ణా నీళ్ల గురించి రంగారెడ్డి, పాలమూరు, నల్గొండలో మీటింగులు పెడ్తానంటున్నవ్​. మీటింగులు పెడ్తవో.. సంతకు పోయి బర్రెలు కాస్కుంటవో కాస్కో. కల్వకుర్తి, కొడంగల్​ సంతకు పో. పెబ్బేరులో పశువుల సంత బాగా జరుగుతది.. అక్కడికి పోయి బర్రెలను కాస్కో? నాదేం పోయింది. నీకు పని లేదు.. ఖాళీగా ఉన్నవ్​. టెలిఫోన్​ ట్యాపింగ్​ చేసినవ్​. సొంత బిడ్డ, అల్లుడు ఫోన్​లను కూడా ట్యాపింగ్​ చేసినవ్​. ఇంతకన్నా సిగ్గులేనోడు ఉంటడా? కేసీఆర్​ గర్జించిండని హరీశ్​ అంటున్నడు. ఆయన గాడ్రింపులకు.. ఉడుత ఊపులకు ఎవరూ భయపడరు. తోలు తీసి పసుపు పూస్తం. అన్నిట్ల మీకు డిపాజిట్లు పోతున్నయ్​. చివరికి దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే ఇజ్జత్​ పోతది” అని సీఎం రేవంత్​ వ్యాఖ్యానించారు. 


నీలెక్క పాస్​పోర్టు బ్రోకర్​ను కాదు
తోలు తీస్తవా.. రా..! నువ్వు (కేసీఆర్​) తోలు తీసుడు కాదు.. కొడంగల్​కు వస్తవా.. మా సర్పంచ్​లనే చింతమడకకు రమ్మంటవా? వస్తరు..  నిన్ను చీరి చింతకు కట్టి.. చింతమడకలో వేలాడేస్తరు. రెండేండ్ల తర్వాత ఫామ్​హౌస్​ల నుంచి బయటకు వచ్చినవ్.. అనుభవంతో సలహాలు ఇస్తవనుకున్నం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్​ సిటీ కడ్తుంటే తొక్క తోలు అంటవా? వాడెవడో వంతారా.. బొంతారా.. అంటవా? ఒక మాజీ సీఎం స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవీ? మర్యాద ఉండదని మేం ఇంకేం మాట్లాడ్తలేం! కానీ, మాట్లాడుడు మొదలు పెడ్తే.. నువ్వు నడుముకు రాయి కట్టుకొని మల్లన్నసాగర్లన్నా, రంగనాయక్​ సాగర్లన్నా దుంకి సచ్చిపోతవ్​​. నన్ను గెలుకకు.. నేను అన్నీ చూసిన.. నల్లమల అడవుల నుంచి వచ్చిన. అమాంబాపతు గాడ్ని కాదు..  నాతోని తమాషాలు చేయకు. దుబాయ్​ పాసుపోర్టు బ్రోకర్ల దందాలు చేయలే.
- సీఎం రేవంత్​రెడ్డి

కేటీఆర్​.. నీ ముఖం 
అద్దంల చూసుకున్నవా?
కేటీఆర్..​ నీ ముఖం ఎప్పుడన్న 
అద్దంల చూసుకున్నవా? పేడుమూతి 
బోడిలింగం. నువ్వెంత.. 
నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పుకుని బతికేటోనివి. గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు.. తెలంగాణ పౌరుషం. ఎవడైనా ఇంటి అల్లుడి ఫోన్​ ట్యాప్​ చేయిస్తడా? సిగ్గుండాలె. ఆస్తి కోసం సొంతచెల్లెను బయటకు వెళ్లగొట్టినోడివి నువ్వూ మనిషివేనా? సొంత చెల్లెలికే సమాధానం చెప్పనోడివి నాకే సవాల్​ చేస్తవా? లాగులో తొండలు ఇడిసి కొడ్త బిడ్డా! నా సంగతి ఇంకా నీకు తెల్వదు. నాతో మాట్లాడుడంటే అమెరికాలో బాత్రూమ్​లు కడిగినట్లను కుంటున్నవా? మీ అయ్యను అడుగు చెప్తడు.

వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి టిఫిన్​, భోజనం
చదువుతోనే మన బతుకులు బాగుపడ తాయని సీఎం రేవంత్​ అన్నారు. కానీ ప్రైవేట్ బడుల్లో వేల రూపాయలు ఫీజులు అవుతున్నా యని.. అందుకే పిల్లలను సర్కారు బడులకు పంపాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘చదువుతోనే మార్పు వస్తుంది.. మీ కుటుంబాల్లో వెలుగు నిండుతుంది. చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే ఐఏఎస్​, ఏపీఎస్​లుగా ఎదుగుతున్నరు. కొడంగల్​ నియోజక వర్గంలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు బ్రేక్​ ఫాస్ట్​, మధ్యాహ్న భోజనం పెడుతున్నం. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో బ్రేక్​ ఫాస్ట్​, మిడ్​ డే  మీల్స్​ను అందు బాటులోకి తీసుకొస్తం. మంచి భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తం. కావాల్సిన వసతులు కల్పిస్తం. మీ పిల్లలను ప్రభుత్వ బడులకు తీసుకురండి. వాళ్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్​, ఐపీఎస్​లు కావాలి. తెలంగాణ పునర్నిర్మా ణంలో భాగం కావాలి. అప్పుడే వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు  రాంమోహన్ రెడ్డి, మనోహర్​ రెడ్డి,  యాద య్య, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్​రెడ్డి, సీనియర్​ నాయకులు కుంభం శివకుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.