- దేశంలోనే అత్యుత్తమంగా నిలుస్తుంది: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- న్యాయ.. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలి
- అప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుంది
- డైనమిక్ సీఎం ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారని ప్రశంస
- 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేస్తం: సీఎం రేవంత్
- న్యాయం ఆశించే పేదవాడికి ఈ భవనం ఆశాదీపం కావాలి
- న్యాయ విలువల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
- హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సీజేఐ శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: వందేండ్ల అవసరాలను తీర్చేలా, దేశంలోనే అత్యుత్తమమైనదిగా తెలంగాణ కొత్త హైకోర్టు భవన సముదాయం నిలువబోతున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, డైనమిక్ చీఫ్ మినిస్టర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విశాలమైన, నిర్మాణాత్మక వైఖరితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ.2,050 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం న్యాయవ్యవస్థ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా, నిర్మాణ పనుల నాణ్యత, వేగంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని అభినందించారు. మౌలిక సదుపాయాలు లేకపోతే రాజ్యాంగం ఇచ్చే ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, కానీ తెలంగాణలో అవి నేడు ఇటుకలు, సిమెంట్ రూపంలో సాకారం అవుతున్నాయని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే రాజ్యాంగం అసలైన ఉద్దేశం నెరవేరుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న వంద ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించ తలపెట్టిన హైకోర్టు నూతన భవన సముదాయానికి సంబంధించి.. జోన్-2 నిర్మాణ పనులకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సీజేఐ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎస్వీ భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పీఎస్ నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అటెండ్ అయ్యారు. హైకోర్టు నూతన ప్రాంగణం న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి ఒక నిలువుటద్దంగా మారుతుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థలో ప్రతి పనిలోనూ ప్రారంభం, పట్టుదల, ఫలితం అనే మూడు కీలక దశలు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం ఒక చారిత్రక మలుపులో ఉందని, ఇప్పటికే జోన్-–1 పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. పునాది పనులు పూర్తయి సూపర్ స్ట్రక్చర్ పనులు కూడా ఊపందుకున్న తరుణంలో, ఇప్పుడు జోన్-2 పనులకు అంకురార్పణ జరిగాయని తెలిపారు. పాత హైకోర్టు భవనం ఎంతో గొప్పదైనప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా అది సరిపోవడం లేదన్నారు. అందుకే ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సమాంతరంగా అడుగులు వేస్తూ, ఈ భారీ క్యాంపస్‌ను నిర్మిస్తున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమ వేదికపైనే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించానని, రెండేండ్లలోనే ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. భవిష్యత్తులో ఇక్కడకు వచ్చే యువ న్యాయవాదులు ఈ భవన నాణ్యతను చూసి, మన దార్శనికతను గౌరవిస్తారని తెలిపారు. ఒక మహావృక్షానికి పైన కనిపించే కొమ్మలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, తుపాన్లను సైతం తట్టుకొని దానిని నిలబెట్టేది కింద ఉండే వేరు వ్యవస్థేనని సీజేఐ తెలిపారు. ఈ వంద ఎకరాల హైకోర్టు ప్రాంగణంలో జోన్-2 అనేది అలాంటి పటిష్టమైన వేరు వ్యవస్థగా పేర్కొన్నారు. 60 ఎకరాల విస్తీర్ణంలో 57 విభిన్న నిర్మాణాలు ఇక్కడ రానున్నాయని, ఇవన్నీ న్యాయవ్యవస్థను దీర్ఘకాలంపాటు పటిష్టంగా ఉంచుతాయని వివరించారు. తరచుగా మాట్లాడుకునే న్యాయవ్యవస్థ స్వతంత్రత అనేది కేవలం తీర్పులకు మాత్రమే పరిమితం కాకూడదని, కోర్టులు పనిచేసే వాతావరణంలోనూ అది ప్రతిబింబించాలని స్పష్టం చేశారు. ఇరుకైన భవనాల్లో లేదా ఎక్కడో చెల్లాచెదురుగా ఉన్న గదుల్లో విధులు నిర్వహించడం వల్ల న్యాయవ్యవస్థ పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు. కోర్టు గదులు, పరిపాలనా కార్యాలయాలు, న్యాయమూర్తుల నివాసాలు శిక్షణా కేంద్రాలు అన్నీ ఒకే చోట ఉండటం వల్ల పనితీరు పెరుగుతుందని పేర్కొన్నారు.
వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేయాలి: సీఎం రేవంత్
న్యాయ విలువల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవస్థల మధ్య ఘర్షణలు ఉండకూడదని, అన్ని విభాగాలూ పరస్పర గౌరవంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. కోర్టులు ఇచ్చే తీర్పులతో పాటు న్యాయస్థానాల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్‌ను కూడా తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల జీవితంలో గుడి, మసీదు, చర్చి నిర్మించే అవకాశం అప్పుడప్పుడూ వస్తుందని, కానీ అన్ని మతాల వారికి ఆశ్రయం కల్పించే న్యాయ దేవాలయాన్ని నిర్మించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు వ్యవస్థలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాలు స్వయంప్రతిపత్తితో పనిచేస్తూనే పరస్పరం గౌరవించుకోవాలని అభిప్రాయపడ్డారు. సాధారణ పౌరుడికి న్యాయస్థానమే చిట్టచివరి గమ్యస్థానమని, పేదలు, బలహీన వర్గాల గొంతుకగా ఈ భవనం నిలుస్తుందని సీఎం తెలిపారు. రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, భావితరాలకు ఒక దిక్సూచిలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రస్తుత భవనం పెరిగిన అవసరాలకు సరిపోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు ఇచ్చే అత్యున్నత గౌరవానికి ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనమని తెలిపారు. 2023 డిసెంబర్లో తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న తొలి ప్రధాన నిర్ణయాల్లో నూతన హైకోర్టు నిర్మాణమని ఒకటి అని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించి, పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. ఇప్పటికే జోన్-1 పరిధిలోని సంస్థాగత భవనాల పనులు ప్రారంభం కాగా, జోన్-2 నివాస భవనాలకు ఇప్పుడు పునాది వేశామన్నారు. రాబోయే 2027 డిసెంబర్ నాటికి ఈ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
ఆధునికతకు ఇది బెంచ్‌మార్క్: సీఎం రేవంత్ రెడ్డి
దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవనాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, ఆధునికతకు ఇది ఒక బెంచ్‌మార్క్‌గా మారుతుందని సీఎం రేవంత్ చెప్పారు. ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, ఇది ఒక ఐకానిక్ భవనంగా నిలుస్తుందన్నారు. న్యాయమూర్తులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఆధునిక వసతులు ఇందులో ఉంటాయని తెలిపారు. న్యాయవ్యవస్థకు ఉత్తమమైన మౌలిక సదుపాయాలు కల్పించడం రాజకీయ కార్యనిర్వాహక వర్గం బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని, ప్రజాస్వామ్య విలువలపై తమకున్న అచంచలమైన నమ్మకాన్ని ఈ భవనం చాటి చెబుతుందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస గృహాల నిర్మాణం చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌కు ఇదొక ‘రెడ్ లెటర్ డే’అని, రాబోయే శతాబ్దం కోసం ఒక అద్భుత కట్టడాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. న్యాయం కోసం ఆశగా ఎదురుచూసే పేదవాడికి ఈ భవనం ఆశాదీపం కావాలన్నారు.
