
- ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం: సీఎం రేవంత్
- రాహుల్‌ని ప్రధానిని చేయడం మన బాధ్యత
- అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తరు.. పోగానే మాయమవుతరు
- ఈ తరానికి ఒకే వైఎస్సార్, ఒకే కేవీపీ
- వైఎస్సార్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ విధానాలను, ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తాండూరు, రంగారెడ్డి జిల్లా వరకు నీటిని తరలించి ఆనాడు రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆనాడు వైఎస్సార్ గొప్ప ప్రణాళిక వేయగా.. అది ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. వైఎస్సార్ ఆశయాలను ఇప్పుడు మేం కొనసాగిస్తామని నేను మాట ఇస్తున్నా. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ లో కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా వైఎస్సార్ రైతులకు చేయదలుచుకున్న మేలు జరిగేలా చూస్తాం. వైఎస్ లక్ష్యమైన ప్రాణహిత--చేవెళ్ల, ఎస్ఎల్బిసీ ప్రాజెక్టులను పూర్తి చేయడం కూడా మా బాధ్యత” అని ప్రకటించారు.
వైఎస్సార్, కేవీపీలాంటి ఫ్రెండ్స్ ఉండరు..
వైఎస్సార్, కేవీపీ రామచంద్రారావు వంటి గొప్ప స్నేహితులు ఎవరూ ఉండరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అధికారం ఉన్నప్పుడు చాలామంది మిత్రులు వస్తారు. అధికారం పోగానే వారంతా మాయమవుతారు. కానీ, కేవీపీ మాత్రం వైఎస్సార్ అకాల మరణం వరకూ తోడుగా ఉన్నారు” అని కొనియాడారు. ‘‘నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారానికి ఒకరో ఇద్దరో నన్ను కలుస్తూ, చనువుగా మాట్లాడుతుంటారు. ‘నేను నీకు వైఎస్ కు కేవీపీలా ఉండిపోతాను’ అని చెప్తుంటారు. దానికి నేను నవ్వి ఈ తరానికి ఒకే రాజశేఖర్ రెడ్డి, ఒకే కేవీపీ ఉంటారు. వారి స్నేహానికి ప్రత్యామ్నాయం లేదు అని చెప్తుంటాను. నేడు కేవీపీలా కావాలనుకునే వాళ్ళందరికీ చెప్పేదొక్కటే. వాళ్లు ఎప్పటికీ కేవీపీలు కాలేరు” అని రేవంత్ రెడ్డి అన్నారు.‘‘వ్యవసాయం దండుగ కాదు. పండుగ కావాలి’ అన్న వైఎస్సార్ ఆలోచనను కొనసాగిస్తూ సేంద్రీయ వ్యవసాయంలో విశిష్ట సేవలను అందించిన సుభాష్ పాలేకర్, సుధా, నాగేశ్వరరావును సన్మానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సేంద్రియ సాగుకు ప్రణాళికలు..
రూ. లక్షల రుణమాఫీ చేసి, రాష్ట్ర రైతాంగాన్ని రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం తమది అని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే.. అని గత సీఎం అంటే, మా సర్కారు వచ్చాక వరి వేసుకోండి. చివరి గింజ వరకూ కొంటామని భరోసా ఇచ్చాం. కనీస మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ కూడా ఇచ్చాం. అందుకే నేడు తెలంగాణ రూ.2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది” అని సీఎం రేవంత్ చెప్పారు. ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ దేశంలోనే అత్యధికంగా వరి పండించే జిల్లాలుగా నిలిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సరైన సహకారం అందించకపోవడం వల్ల యూరియా అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సహనం గొప్ప విషయం: కేవీపీ
అధికారంలో ఉన్న వ్యక్తి, మరో వ్యక్తిని అదేపనిగా పొగడడం అనేది మామూలు విషయం కాదని.. రేవంత్ రెడ్డి అంత సహనంతో వ్యవహరించడం నిజంగా గొప్ప విషయం అని కేవీపీ రామచంద్రారావు అన్నారు. వైఎస్సార్ తో 1966 నుంచి తనకు 58 ఏళ్ల సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ‘‘రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్పవాడో.. మీరందరూ ఇంతసేపు కూర్చుని మాట్లాడుతుంటే.. నాకు నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’’ అని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఉచిత విద్యుత్ వైఎస్సార్ పేటెంట్: భట్టి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు, కాంగ్రెస్ భావజాలాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం అయిన మొదటి రోజే వైఎస్ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారని అన్నారు. దేశంలో ఉచిత విద్యుత్ పథకం అంటే.. అది వైఎస్సార్ కు పేటెంట్ అని చెప్పొచ్చన్నారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించడానికి ఉచిత కరెంటు, విద్య, వైద్య ఖర్చులు తగ్గించడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెచ్చారని వివరించారు.
రైతుల సంక్షేమం గురించే ఆలోచించేవారు: రఘువీరారెడ్డి
వైఎస్సార్ ఎప్పుడూ రైతుల సంక్షేమం గురించే ఆలోచించేవారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. సీఎంలు సాధారణంగా ఉదయం లా అండ్ ఆర్డర్ నివేదికలతో తమ రోజును ప్రారంభిస్తారని, కానీ వైఎస్సార్ మాత్రం మొదట రైతులు, వ్యవసాయం గురించే తెలుసుకునేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్ కుటుంబసభ్యులు ఆస్తుల కోసం కొట్లాడుకుంటుంటే.. కేవీపీ మాత్రం వైఎస్సార్ వారసత్వాన్ని, స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న చర్యలపై రఘువీరా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.