- మతాల మధ్య చిచ్చుపెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నరు
- ముస్లింలకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం
హైదరాబాద్, వెలుగు: మతాల మధ్య చిచ్చు పెట్టాలని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కలిసి మెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు (దావత్- ఎ- ఇఫ్తార్) కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్దామని కోరారు. “రంజాన్ కేవలం పండుగ కాదు. ఆత్మశుద్ధి చేసుకునే సమయం.. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు సంతోషం గా ఉంది. సోదరభావం తీసుకువచ్చి మతసామరస్యం తో కలిసి మెలిసి ఉండాలి. ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.
అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాం. సీనియర్ నేత షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇచ్చాం. 8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం. బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్లు ఇచ్చి ప్రోత్సహించాం. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో మైనార్టీలకు సింహ భాగం ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలోనూ మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నాం” అని ఆయన చెప్పారు. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, రిజర్వేషన్ల వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. ‘‘ఈ ప్రభుత్వం మీది. నేను మీ సోదరుడిని. మీ ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి కావాలి” అని సీఎం కోరారు.
రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, మైనార్టీ కార్పొరేషన్ ల చైర్మన్ లు, భారీ ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు.
