- ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో
- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ
- ప్రాజెక్టును కోర్టు నిలువరించేలా ఆధారాలు సమర్పించండి
- సీనియర్ లాయర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచన
- ఇయ్యాల రాష్ట్ర సర్కారు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
- ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా..
హైదరాబాద్, వెలుగు: పోలవరం –నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపించాలని సీనియర్ లాయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రాజెక్టును కోర్టు నిలుపుదల చేసేలా పక్కా ఆధారాలు సమర్పించాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. పోలవరం -–నల్లమలసాగర్ లింక్‌పై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలో ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థమైన వాదనలు వినిపించాలని కోరారు. అనుమతులు లేకుండా పోలవరం –బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ.. ఈ పనులు ఆపేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని పలు అంశాలను ప్రస్తావించింది. మొదట్లో ఆమోదించిన మేరకు పోలవరం ప్రాజెక్టు పనుల స్వరూపం ఉండాలని, విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కావని స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. అందుకు సంబంధించి కేంద్ర జల సంఘం, కేంద్ర జల మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి సిద్ధపడుతున్నదని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతున్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ప్రస్తావించింది.
గత నెలలో సుప్రీంకోర్టుకు
మిగులు/వరద జలాల పేరుతో గోదావరిపై ఏపీ అక్రమంగా నిర్మించతలపెట్టిన పోలవరం– (బనకచర్ల) నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌ను నిలువరించాలని నిరుడు డిసెంబర్‌లో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వరద నీటిని తరలించే ముసుగులో ఏపీ సర్కారు ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీ, సెగ్మెంట్ –1 కింద ఉండే ప్రస్తుత కనెక్టివిటీ పనుల విస్తరణ, కుడి ప్రధాన కాలువ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకుండా స్టే విధించాలని అభ్యర్థించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం 251 పేజీలతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తరఫున అడ్వొకేట్ సుమంత్ నూకల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర జల వనరుల శాఖ, ఆర్థిక, పర్యావరణ శాఖలతోపాటు జీఆర్ఎంబీ, ఏపీ సర్కార్, కేఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), సీడబ్ల్యూసీని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చీతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. ఏపీ విభజన చట్టం, అంతరాష్ట్రీయ నదీ జలాల చట్టం, సీడబ్ల్యూసీ, పీపీఏ, కృష్టా, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డులు, భౌగోళికంగా ఉల్లంఘన అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఏపీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ సహజ న్యాయసుత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లోని ప్రభావిత రాష్ట్రాల అవసరాలను ముందుగా తీర్చకుండానే, నీటిని పెన్నా బేసిన్‌కు మళ్లించడానికి ఏపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర హక్కులకు లాక్కుంటున్న పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్ట్ ను నిలుపుదల చేయాలని పిటిషన్ సర్కారు కోరింది.
నేడు ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ దిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నది. తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు, పోలీస్ అధికారి రాధాకిషన్ రావుపై పంజాగుట్ట స్టేషన్‌లో 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. విచారణ అనంతరం హరీశ్‌రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని 2024 డిసెంబర్ 4న హైకోర్టును హరీశ్‌రావు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్.. ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ నిరుడు మార్చి 20 న ఆదేశాలు ఇచ్చింది. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర్‌గౌడ్ కంప్లైంట్ ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిరుడు జూన్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హరీశ్‌రావుతోపాటు రాధాకిషన్‌రావు, కంప్లైంట్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ పేరును ప్రతివాదులుగా చేర్చింది.
