సభకు రాకుంటే పదవి ఎందుకు ? అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌‌ క్లాస్

సభకు రాకుంటే పదవి ఎందుకు ? అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌‌ క్లాస్
  • ఏడాదిలో 30 రోజులు అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా?
  • పార్టీ ఎమ్మెల్యేలంతా సెషన్‌‌కు హాజరుకావాల్సిందే.. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌‌ క్లాస్​
  • మళ్లీ బీ ఫాం ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కాగా చూస్తానని వార్నింగ్​
  • నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను.. మంత్రులు కూడా ఇవ్వాలి
  • ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి.. ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు
  • మీడియాతో చిట్‌‌చాట్‌‌లు చేయొద్దు 
  • గత బీఆర్ఎస్ హయాంలో సీఎల్పీ నేతలకూ మైక్ ఇవ్వలేదు 
  • ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబివ్వాలని సూచన

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌‌రెడ్డి క్లాస్​ తీసుకున్నారు.  ఏడాదికి 30 రోజులు నడిచే సభకు రానోళ్లు.. ఆ పదవికేం న్యాయం చేస్తారు? అని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే కావాలనేది చాలా మంది జీవితాశయం.. దశాబ్దాల పాటు కష్టపడితే కానీ ఈ పదవి రాలేదు.. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారని,  పరిష్కరిస్తారని లక్షల మంది ఆశగా చూస్తుంటారు..  మరి అలాంటి కీలక పదవిలో ఉంటూ సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే కావడం ఎందుకు?” అని వ్యాఖ్యానించారు. 

సోమవారం అసెంబ్లీ బడ్జెట్ ​సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం  శాసన మండలిలోని కాన్ఫరెన్స్ హాల్‌‌లో  సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటు సభకు, అటు సీఎల్పీ సమావేశానికి రానంత బిజీగా ఎమ్మెల్యేలు ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘‘కొందరు సభకే రారు. వచ్చిన వారు సంతకం పెట్టి పోతున్నారు. మీరు ఎమ్మెల్యే కావడానికి మీ కింద ఎందరో కష్టపడ్డారు. 

నియోజకవర్గ జనం మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ మీరు ఆ పదవిలోకి వచ్చిన తర్వాత ఇటు జనం.. అటు పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌ ఆశించిన రీతిలో పనిచేయకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు’’ అని హెచ్చరించారు.  సభకు తప్పనిసరి హాజరుకావాలని,  మైక్ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, లేదంటే మళ్లీ బీ ఫాం ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కగా చూస్తానని హెచ్చరించారు.

మంత్రులు టైం ఇవ్వడంలేదని ఫిర్యాదులొస్తున్నయ్​..
సీఎంగా తాను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తున్నానని, వచ్చిన ఎమ్మెల్యేలే తన వద్దకు మళ్లీ, మళ్లీ వస్తున్నారని, చాలా మంది ఎమ్మెల్యేలు అసలు రావడం లేదని రేవత్‌‌‌‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో విప్‌‌‌‌లు శ్రద్ధ చూపి సమన్వయం చేయాలని సూచించారు. చాలా మంది మంత్రులు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే సమయం ఇవ్వడం లేదనే ఫిర్యాదులు తనకు అందుతున్నాయని రేవంత్ అన్నారు. ‘‘ఇక్కడ సీఎంగా నేను ఎమ్మెల్యేలకు టైం ఇస్తున్నాను. 

పార్లమెంట్‌‌‌‌లో కేంద్ర మంత్రులు ప్రతి సభ్యుడికి సమయం ఇస్తారు. మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులు ఎందుకు టైం కేటాయించరు?’’ అని  సీఎం ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలకు  మంత్రులు  సమయం ఇవ్వాలని, వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. సభ జరుగుతున్న  సమయంలో ప్రతి సభ్యుడు అప్రమత్తంగా ఉంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టిగానే సమాధానం ఇవ్వాలన్నారు.


సభలో ప్రభుత్వంపై ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తే, వారు తనను అన్లేదు కాదా.. అని చూస్తూ ఊరుకోవద్దని, ఇలా వ్యవహరిస్తే అందరం నష్టపోతామని సీఎం చెప్పారు. ‘‘అధికారం పోతే అందరిది పోతుంది.. ఏ ఒక్కరిదో పోదు.. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ అంటూ ఏమీ ఉండదు.. వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజీ చేస్తుంది.. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది” అని హితవు పలికారు. 

పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, కేంద్ర సర్కారు తీరును సభలో ఎండగట్టాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు. సభలో అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతోపాటు.. అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ప్రజా పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.

ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి.. 
ఎమ్మెల్యేలు మీడియాతో చిట్‌‌‌‌చాట్‌‌‌‌లు చేయొద్దని,  బయట ఏ వేదిక మీదైనా జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా మాట్లాడవద్దని హితవు పలికారు. ‘‘మీరు తప్పు మాట్లాడితే దాని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సరే.. పార్టీ, ప్రభుత్వ లైన్‌‌‌‌లోనే మాట్లాడాలి. ఆ లైన్ దాటి మాట్లాడితే అందరం నష్టపోతాం’’ అని అన్నారు. 

ఎమ్మెల్యేలు ఇటు పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌తో.. అటు ప్రజలతో  మమేకమవుతూ.. వారి సమస్యలు, ఇబ్బందుల పరిష్కారంపై  దృష్టి పెట్టాలని సీఎం  కోరారు. సభలో అన్ని విషయాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన సభలతో పోల్చుకుంటే మనమే సభలను స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తున్నామని, గత ప్రభుత్వం మాదిరిగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం తాము చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సభ ప్రారంభమయ్యే మొదటి రోజునే తనను బలవంతంగా సస్పెండ్ చేసి, సభనుంచి బయటకు పంపించారని,  సభలో కొట్లాడి మైక్ తీసుకొని మాట్లాడేవాడినని గుర్తు చేశారు. ప్రతిపక్షాల విషయంలో తాము ఇలా వ్యవహరించడంలేదన్నారు. వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నామని, ఇందులో వివక్ష చూపడం లేదని చెప్పారు.  బీఆర్ఎస్ హయాంలో సీఎల్పీ నేతలుగా ఉన్న జానా రెడ్డి, భట్టికి సైతం మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

సభలో చర్చ పక్కదారి పట్టకుండా చూడాలి..
సభలో చర్చ జరగుతున్న సమయంలో ఎవరికి ఏ సబ్జెక్ట్ పై అవగాహన ఉంటుందో వారు దానిపై మాట్లాడాలని సీఎం రేవంత్‌‌‌‌ సూచించారు. సభ జరుగుతున్న సమయంలో విప్‌‌‌‌లు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. 

సభలో చర్చ పక్కదారి పట్టకుండా, సభా సమయం వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత విప్‌‌‌‌లపై ఉందన్నారు. ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సభకు అందరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. ప్యానెల్ స్పీకర్ బాలునాయక్ బాగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ‘‘ఈ సభలో మహిళా ఎమ్మెల్యేలు బాగా చదువుకున్న వారు ఉన్నారు. సభలో జరిగే చర్చల్లో వారంతా చురుగ్గా పాల్గొనాలి’’ అని సూచించారు. పలు విషయాలపై ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేయాలని కోరారు. 

ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి..
గవర్నర్ ప్రసంగం  ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిదని,  భవిష్యత్తు ప్రణాళికలు, మనం ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌‌‌‌ సూచించారు. ‘‘ఇది మన ప్రభుత్వం..ఇప్పుడు మనం వేసుకునే రోడ్ మ్యాప్ వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్యపై నియోజకవర్గాలవారీగా ఫోకస్ పెట్టాలి. 99 రోజుల ప్రజా పాలన..ప్రగతి ప్రణాళికను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని ఎమ్మెల్యేలకు తెలిపారు.

కాగా, సీఎల్పీ సమావేశానికి హాజరయ్యేందుకు కౌన్సిల్ భవనంలోకి వెళ్తున్న మంత్రి దామోదర రాజనర్సింహను సీఎం సెక్యూరిటీ అడ్డుకున్నారు. సీఎం రేవంత్ వెళ్లే ద్వారం నుంచి కాకుండా బయటి ద్వారం గుండా వెళ్లాలని సెక్యూరిటీ అధికారులు మంత్రిని కోరారు. దీంతో వారిపై దామోదర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చేసేదేమి లేక సెక్యూరిటీ సిబ్బంది మౌనంగా ఉండిపోవడంతో దామోదర.. సీఎం వెళ్లే ద్వారం నుంచే కౌన్సిల్ భవనంలోకి వెళ్లారు.