- మార్చిలో ఈవెంట్ ప్రారంభానికి రావాలని కోరిన నిర్వాహకులు
- హార్వర్డ్ విద్యార్థులతో సీఎం ఆత్మీయ సంభాషణ
- తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఎన్నారైలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం పలికింది. ఆ స్కూల్ లో నిర్వహించనున్న మొట్టమొదటి ‘ఏఐ పాలసీ సింపోజియం’లో కీలకోపన్యాసం చేయాల్సిందిగా కోరింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందుకున్న ఏకైక భారతీయ నాయకుడు రేవంత్ రెడ్డి కావడం విశేషం. మార్చిలో జరగనున్న ఈ ఈవెంట్‌ను హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ డీన్ జెరెమీ వెయిన్‌స్టీన్‌తో కలిసి ప్రారంభించాలని నిర్వాహకులు సీఎంను కోరారు.
నిర్వాహకురాలు రక్సాండా రెనిటా, ఇతర ప్రతినిధులు క్యాంపస్‌లో సీఎంను స్వయంగా కలిసి ఈ ఆహ్వానాన్ని అందించారు. ఈ సదస్సులో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రపంచ స్థాయి నాయకులు, టెక్ నిపుణులతో జరిగే ప్యానెల్ చర్చలోనూ సీఎం పాల్గొనే అవకాశముంది. అయితే, హైదరాబాద్ నుంచే వర్చువల్ విధానంలో ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తానని సీఎం తెలిపారు.
ఎంఐటీ, కొలంబియా వర్సిటీ స్టూడెంట్లతో సీఎం సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తన పర్యటన చివరి రోజున బిజీబిజీగా గడిపారు. మసాచుసెట్స్‌లోని బోస్టన్ -కేంబ్రిడ్జ్‌లో ఉన్న హార్వర్డ్ వర్సిటీలో పలు బృందాలతో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా హార్వర్డ్‌తో పాటు ప్రతిష్టాత్మక ఎంఐటీ, కొలంబియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
నాయకత్వ లక్షణాలు, విజన్ గురించి తమకు పాఠాలు చెప్పాలని విద్యార్థుల బృందం సీఎంను కోరగా.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. ‘‘పాఠాలు బోధించడానికి ఇక్కడ గొప్ప ప్రొఫెసర్లు ఉన్నారు. నేనేం ఎంపికైన ప్రొఫెసర్‌ను కాదు. కేవలం మీతో ముచ్చటించి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికే వచ్చాను’’ అంటూ సీఎం చమత్కరించారు.
ఈ సమ్మేళనంలో విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అనేక అంశాలపై సీఎంతో చర్చించారు. నాయకత్వం, విజయం, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి నమూనాలు, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలతో పాటు.. రైతులు, మహిళలు, యువత సంక్షేమంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌ను ఆవిష్కరించారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో రాబోయే అవకాశాలు, సాధికారతకు సంబంధించిన ప్రణాళికలను వారికి వివరించారు. భారతదేశ భవిష్యత్‌పై, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ దేశానికి దిక్సూచిగా మారుతున్న తీరుపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమితో అనుబంధం తెంచుకోకుండా.. ‘తెలంగాణ రైజింగ్’ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని విద్యార్థులకు సీఎం పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన విద్యార్థులు తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని మాటిచ్చారు.
