మార్చ్ 27న భద్రాచలం రామాలయ పనులకు సీఎం భూమిపూజ : దేవాదాయశాఖ  ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ 

మార్చ్  27న భద్రాచలం రామాలయ పనులకు సీఎం భూమిపూజ : దేవాదాయశాఖ  ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ 
  • దేవాదాయశాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ 

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం రామాలంయలో శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. ఈ నెల 27న జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవం, 28న నిర్వహించే మహా పట్టాభిషేకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం ఆమె దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 27న సీఎం రేవంత్​రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారని తెలిపారు.

భూమిపూజ కార్యక్రమానికి రద్దీ పెరగకుండా పరిమిత సంఖ్యలో పాస్‌‌లు జారీ చేయాలని సూచించారు. మిథిలా స్టేడియంలో కల్యాణం తర్వాత తలంబ్రాల కోసం భక్తులు ఒక్కసారిగా స్టేజీ పైకి రావడానికి ప్రయత్నిస్తారని, అలా జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని కలెక్టర్ అంకిత్ తెలిపారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాల్లో లోటు రాకుండా చూస్తామని పేర్కొన్నారు.