హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పాలసీలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎలాంటి విధానాలు అవసరమనేది స్టడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న తెలంగాణ కేడర్ కు చెందిన 2023 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్లు మంగళవారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ ట్రైనీ ఐఏఎస్‌లను సీఎంకు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలన వ్యవహారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. సీఎంతో భేటీ తరువాత ట్రైనీ ఐఏఎస్‌లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. కమిట్మెంట్ తో పనిచేసి ప్రజల మన్నలను పొందాలన్నారు. శిక్షణలో ఉన్న అధికారులకు కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో వారు నిర్వహించిన విధుల గురించి శశాంక్ గోయల్ డిప్యూటీ సీఎంకు వివరించారు. భౌగోళికంగా, వాతావరణం విషయంలో తెలంగాణ రాష్ట్రం చాలా బాగుంటుందని, ప్రజల సహకారం కూడా మంచిగా లభిస్తుందని భట్టి అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు ఉన్నారు.
రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్రీ లాంచ్‌ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని.. ఇటీవల ఇలాంటివి మరింతగా పెరిగిపోయాయని తెలిపారు. తెలంగాణ రియల్ ఎస్టేట్అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని డాక్టర్ బీఆర్అంబేద్కర్సెక్రటేరియేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెరా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. కొనుగోలుదారులు మోసపోకుండా చూడాలన్నారు. సీఎంను కలిసిన వారిలో చైర్మన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పల్లె ప్రదీప్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్ ఉన్నారు.