- ఢిల్లీలో నేడు బిజీబిజీగా గడపనున్న సీఎం రేవంత్
- ఉదయం 10:30కి సీడబ్ల్యూసీ మీటింగ్కు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం బిజీ బిజీగా గడపనున్నారు. ఉదయం 10:30కి పార్టీ హెడ్ ఆఫీసులో జరిగే అత్యున్నత నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఉత్తరాఖండ్ హల్ద్వానీ ‘శుద్దీకరణ’, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు, రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలు, దేశ వ్యాప్తంగా పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
అనంతరం.. ఉత్తరాఖండ్ హల్ద్వానీ ‘శుద్దీకరణ’ పై కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ ఫోరం కానిస్టిట్యూషన్ క్లబ్లో నిర్వహిస్తోన్న ‘దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సు’లో పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు.. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ అంశాలపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. సాయంత్రం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా.. ఏపీ, తెలంగాణ ల మధ్య జల వివాదాల పరిష్కారాలు, రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు అనుమతులు కోరనున్నట్లు తెలిసింది. అలాగే సీఎంవో పలువురు కేంద్ర మంత్రుల అపాయిట్మెంట్ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనంతరం రాత్రికి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరనున్నట్లు సమాచారం.
