అప్పుడు సైమన్ గో బ్యాక్.. త్వరలో సర్ గో బ్యాక్: ‘ప్రతిదిన్’ పత్రిక కాంక్లేవ్‌‌‌‌లో సీఎం

అప్పుడు సైమన్ గో బ్యాక్.. త్వరలో సర్ గో బ్యాక్: ‘ప్రతిదిన్’ పత్రిక కాంక్లేవ్‌‌‌‌లో సీఎం
  • ఓటు హక్కు దేశ ప్రజాస్వామిక సమస్య
  • ఈసీని సైమన్ కమిషన్ లా వాడుతుండ్రు
  • బీజేపీ అంటే బ్రిటిష్​ జనతా పార్టీ
  • మైనార్టీలను అణిచేస్తే విప్లవమే
  • ‘ప్రతిదిన్’ పత్రిక కాంక్లేవ్‌‌‌‌లో సీఎం

న్యూఢిల్లీ: "నాడు సైమన్ గో బ్యాక్ నినాదం కింద దేశం ఏకమైనట్లు, రానున్న రోజుల్లో 'సర్ గో బ్యాక్' నినాదం కింద ఏకమవుతుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అస్సాం దినపత్రిక 'ప్రతిదిన్' నిర్వహించిన కాంక్లేవ్‌‌‌‌లో 'ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్' అంశంపై ఆయన మాట్లాడారు.

ప్రధాని మోదీ ఎన్నికల కమిషన్‌‌‌‌ను సైమన్ కమిషన్ మాదిరే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో సర్ గోబ్యాక్ ఉద్యమం వస్తుందని, ఇందులో మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్.. అంతా ఒక్కటవుతారని చెప్పారు. 

1928లో ఏడుగురు బ్రిటిషర్లతో సైమన్ కమిషన్ నియమిస్తే లాలా లజపతి రాయ్ 'సైమన్ గో బ్యాక్' నినాదం ఇచ్చారని, దేశమంతా ఏకమైందని రేవంత్ గుర్తుచేశారు. 1929 తర్వాత వందేళ్లకు మోదీజీ అదే తరహాలో ఎన్నికల కమిషన్‌‌‌‌ను వాడుకుంటున్నారని, "బ్రిటిష్ జనతా పార్టీ" అవే ఎత్తుగడలు వేస్తోందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ సభలో చర్చించి ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇచ్చారని, గతంలో అనేకసార్లు జరిగిన సర్ ప్రక్రియ ఓటు హక్కు ఇచ్చేందుకేనని, ఈసారి తొలగించేందుకు చేస్తున్నారని ఆరోపించారు.

డీలిమిటేషన్‌‌‌‌తో చిన్న రాష్ట్రాలకు నష్టం
నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ, రాజకీయాలు అంకెల ఆట అని, సంఖ్యాబలం ఉంటేనే ఢిల్లీ పిలిచి మాట్లాడుతుందని రేవంత్ అన్నారు. 1976లో ఇందిరా గాంధీ లోక్‌‌‌‌సభ స్థానాలను 543కి ఫ్రీజ్ చేశారని, తర్వాత వాజ్‌‌‌‌పేయీ మరో 25 ఏళ్లు పొడిగించారని, 2026లో మోదీ అలాగే పొడిగిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల పేరుతో పెద్ద రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచుతూ చిన్న రాష్ట్రాలను ఖతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో 80 సీట్లు ఉన్నాయని, 50 శాతం పెంచితే 30, 120 అవుతాయని, సీట్ల తేడా 60 నుంచి 90కి పెరుగుతుందని లెక్క చెప్పారు. తమ వద్ద సంఖ్యాబలం లేనప్పుడు ప్రాధాన్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరా, రాజీవ్ గాంధీల హయాంలో రక్షణ, ఆర్థిక, హోం వంటి కీలక శాఖలు దక్షిణాదికి ఇచ్చేవారని, ఇప్పుడు ప్రధాని, హోం, రక్షణ, వాణిజ్యం సహా అన్ని ముఖ్య పదవులు ఉత్తరాదికే ఉన్నాయని అన్నారు. దక్షిణాది సీట్లు అవసరం లేకపోవడమే కారణమన్నారు.

నాణ్యమైన విద్యే లక్ష్యం
తెలంగాణ లోని 25 లక్షల ఎకరాల భూములను దళితులు, ఆదివాసీలు, పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిదన్నారు. అయితే... ఇప్పుడు కొత్తగా పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు, వెల్ఫేర్ కోసం భారీ మొత్తంలో రీసోర్సెస్ లేవన్నారు. ‘చదవువే అన్నింటికన్నా ముఖ్యమైంది. చదువుతోనే అంబేడ్కర్, అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్ వంటి ఎంతో మంది దేశ అత్యున్నత స్థానాలను అధిరోహించారు. అందుకే తెలంగాణ యువతకు నేను నాణ్యమైన విద్య, నైపుణ్యం అందిస్తాను.’ అని స్పష్టం చేశారు.

దేశంలోని ప్రభుత్వ స్కూల్స్ ను పరిశీలిస్తే... 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారన్నారు. కానీ తెలంగాణ లో 17 మందికి ఒక టీచర్ ఉన్నట్లు చెప్పారు. అయినప్పటికీ... ప్రతి యేడాది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 18 లక్షలకు పడిపోయిందన్నారు. విద్యాకమిషన్ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించినట్టు సీఎం చెప్పారు. నర్సరీ, యూకేజీ, ఎల్ కేజీ విద్యకు ఫౌండేషన్ అని సీఎం అన్నారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ అవసరం ఉందని చెప్పారు. 

ఓట్లెందుకు తగ్గుతున్నయ్
2014లో మోదీ ప్రధాని అయినప్పుడు 81 కోట్లు, 2019లో 91 కోట్లు, 2024లో 97 కోట్ల ఓట్లు ఉండగా, 2029 ఎన్నికలకు సంబంధించి 13 కోట్ల ఓట్లు తొలగించారని రేవంత్ చెప్పారు. జనాభా, ఆయుర్దాయం పెరుగుతున్నప్పుడు ఓట్లు పెరగాలి కానీ కోట్ల ఓట్లు ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. తనను వ్యతిరేకించిన వారి ఓట్లను మోదీ తొలగిస్తున్నారని, వాట్సాప్, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారి మతం, కులం అంటూ ఓట్లు తీసేస్తారని ఆరోపించారు. ఏఐ టెక్నాలజీ వాడి ఓట్లు తీసివేస్తున్నారని, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరికి తెలియకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు.

బూత్ లెవల్ అధికారి నుంచి కలెక్టర్ వరకు అధికారాలన్నీ ఎన్నికల కమిషన్ గుప్పిట్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదని, దేశ ప్రజాస్వామిక సమస్య అని చెప్పారు. "గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్" అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఉత్తర కొరియాలో కిమ్ పార్టీయే ఉంటుందని, జ్ఞానేష్ కుమార్‌‌‌‌ను పది రోజులు అక్కడికి పంపితే శిక్షణ తీసుకొచ్చి మోదీకి వందకు వంద శాతం ఓట్లు వేయిస్తారని వ్యాఖ్యానించారు.