దేవుళ్లను రాజకీయాలకు వాడొద్దు.. రాముడికి, శివుడికి మధ్య విభజనా ?: సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

దేవుళ్లను రాజకీయాలకు వాడొద్దు.. రాముడికి, శివుడికి మధ్య విభజనా ?: సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
  • రాముడు ఉత్తరాది, శివుడు దక్షిణాది అని విడదీయడం సరికాదు
  • సీఎం బాధ్యతాయుతంగా ఉండాలె
  • హరహర మహాదేవ అనని బీజేపీ లీడర్లు లేరు
  • సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం రాముడు, శివుడి మధ్య విభజన తెచ్చే ప్రయత్నం చేయడం తగదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌కుమార్ అన్నారు. రాముడు ఉత్తరాదికి, శివుడు దక్షిణాదికి చెందినవారిగా విభజిస్తూ రాజకీయాలు చేయడం సరికాదని, ఇది హిందూ ధర్మ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొన్నారు.

ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటున్న సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, ఇప్పుడు రాముడికి, శివుడికి మధ్య రాజకీయ విభజన సృష్టించే కుట్ర చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పుబట్టారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం కొలువైన తెలంగాణకు సీఎంగా కొనసాగుతున్న రేవంత్‌‌‌‌రెడ్డి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు.

లోక కల్యాణం కోసం శివుడు హాలాహలం తాగి నీలకంఠుడైతే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కులానికి కులానికి, ఉత్తరానికి దక్షిణానికి, ఇప్పుడు ఏకంగా శివుడికి, రాముడికి మధ్య హాలాహలం చిమ్ముతోందని ఆరోపించారు. రేవంత్‌‌‌‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని మణ్యంకొండ ఆలయమే హరిహర క్షేత్రంగా విలసిల్లుతోందని, హరిహరులను ఏకం చేసే సంప్రదాయాన్ని రాజకీయాల కోసం విభజించడం తగదన్నారు.

దేవుళ్లకు వర్గం, ప్రాంతం ఆపాదిస్తారా?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం దేవుళ్ల పేరిట ప్రమాణాలు చేసిన రేవంత్‌‌‌‌రెడ్డి.. ఇప్పుడు అదే దేవుళ్లను ప్రజలను విభజించేందుకు వాడుకుంటున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. నిన్నటివరకు తమ హామీలకు దేవుళ్లను సాక్షులుగా పెట్టుకుని, నేడు అదే దేవుళ్లకు కులం, వర్గం, ప్రాంతం ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాశీ విశ్వనాథుడితో వారణాసి ఎంపీగా ప్రధాని మోదీకి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం అందరికీ తెలిసిందేనని బండి సంజయ్ అన్నారు. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తొలి ప్రధాని మోదీయేనని గుర్తుచేశారు. ‘హర హర మహాదేవ్’ అనని బీజేపీ నేతలు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. దేవుళ్లను రాజకీయ విభజనకు వాడటం మానుకోవాలని, కాంగ్రెస్ విభజన రాజకీయాలను ప్రజలు గుర్తించాలని కోరారు.