- సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజియం సిఫారసు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఆయనతో పాటు గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను కూడా సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సూచించింది. ఈ మేరకు సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజియం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ సునీతా అగర్వాల్ ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఏకగ్రీవంగా సిఫారసు చేసినట్లు వెల్లడించారు. ఈ సిఫారసులను కేంద్రం రాష్ట్రపతికి పంపనుంది. కేంద్రం పంపే సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే.. ఈ ముగ్గురు జడ్జీలు సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్తారు.
