- ఆ తర్వాతే కార్పొరేషన్ ఎన్నికలు
- ‘ఖైరతాబాద్’ ప్రకటన ఆలస్యమైతే ఇంకా లేటు
- మూడింటికి కలిపా లేక ముందు జీహెచ్ఎంసీకా ?
- అధికారులతో సర్కారు చర్చలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రారంభమైంది. అభ్యంతరాల స్వీకరణ, ఫైనల్లిస్ట్ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించడం, ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌పై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ అంతలోపే వస్తే మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఇంకా ఆలస్యం కావచ్చు.
ఒకేసారా? వేర్వేరుగానా?..
జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలా? లేక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే మిగిలిన రెండు కార్పొరేషన్లకు ఎలక్షన్లు పెట్టాలా అన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు అధికారులతో చర్చించినట్లు తెలిసింది. అయితే, మూడు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల యంత్రాంగాన్ని కో ఆర్డినేట్చేయడం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు కష్టమవుతుందని, అందుకే వేర్వేరుగా నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీంతో ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
‘ఖైరతాబాద్ ’తో మరింత ఆలస్యం ?
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలా? లేక కొంత సమయం ఇచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలా? అనే అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే ఖైరతాబాద్ ఉప ఎన్నికకి సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే ఖైరతాబాద్సీటు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటన కూడా చేశారు. ఆరు నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి కానున్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగేలోపే ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత ఆలస్యం
కావచ్చని సమాచారం.
వరుసగా ఎన్నికల హీట్....
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక, మూడు కార్పొరేషన్ల ఎన్నికలతో నగర రాజకీయాలు హాట్‌హాట్‌గా మారనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారిస్తుండడంతో అప్పుడే మహానగరంలో ఎన్నికల వేడి పుట్టింది. ఎమ్మెల్సీ, కార్పొరేషన్, ఖైరతాబాద్ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించకపోయినా అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.
