సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే: ఓటు చోరీపై రాహుల్ చెప్పిందే నిజమైందన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే: ఓటు చోరీపై రాహుల్ చెప్పిందే నిజమైందన్న మంత్రి వివేక్ వెంకటస్వామి
  • పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
  • హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు నుంచి సీఈవో ఆఫీస్​ వరకు ర్యాలీ 
  • మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్​ దిష్టిబొమ్మల దహనం
  • సీఈవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం 
  • ఓటు చోరీపై రాహుల్ చెప్పిందే నిజమైందన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకతను దెబ్బతీస్తున్న చీఫ్ ఎలక్షన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్‌‌‌‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగగా, హైదరాబాద్‌‌‌‌లో పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్ బాగ్‌‌‌‌లోని ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీఈసీ రాజీనామా కోరుతూ.. పలు డిమాండ్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, రామ్మోహన్ రెడ్డి, గణేశ్, శంకరయ్యతోపాటు పార్టీ నేతలు దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే ఓట్ చోరీ నిజమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘సర్’ పేరుతో పౌరుల ఓట్లను తొలగిస్తున్న తీరును ఇతర కమిషనర్లే అంగీకరిస్తున్నారన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, పౌరుల ఓటు హక్కును కాపాడటానికి రాహుల్ గాంధీ మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. 

ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు అయిన ఓటు హక్కునే కాలరాస్తే.. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విశ్వసించే రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌‌‌‌తో చేతులు కలపాలని కోరారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. 

ఈసీ స్వతంత్రతను కాపాడాలి: మహేశ్ గౌడ్
కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయత, సమగ్రతను పరిరక్షించాలంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, నిర్ణయాలు, ‘సర్’ ప్రక్రియపై వెలువడుతున్న అనుమానాలపై మొదటినుంచీ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ,  ఎన్నికల డేటా నిర్వహణ తదితర అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌‌‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయన్నారు. 

‘సర్’ ప్రక్రియలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13 కోట్లకుపైగా ఓటర్ల పేర్లు తొలగించినట్టు వచ్చిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని జ్ఞానేశ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఆయన పదవీకాలంలో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన అంశాలపై నిష్పాక్షిక పరిశీలనకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

 జ్ఞానేశ్ తప్పుకోవాల్సిందే: మంత్రి వివేక్ వెంకటస్వామి
ఎన్నికల సంఘంలో పారదర్శకత కోసం సీఈసీ పదవి నుంచి జ్ఞానేశ్ కుమార్ తప్పుకోవాల్సిందేనని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించకుండా చూడాలన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలు, తగిన అప్పీల్ అవకాశం కల్పించాలని సూచించారు. దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో సుమారు 60 వేల ఓట్లకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడాలన్నారు. ఏ ఓటరు పేరు తొలగించినా.. ముందస్తు సమాచారం, అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. 

ఎన్నికల సంఘం వ్యవహారంపై కాంగ్రెస్ ధర్నా చేస్తున్న సమయంలోనే.. బీఆర్ఎస్ నేతలు ఇతర అంశాలపై నిరసనలు చేపడుతూ ప్రజ ల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక, పరిపాలనా అంశాలపై బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.