మున్సిపల్ ఎన్నికల్లో సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అనుకూలం: సీఎం రేవంత్

మున్సిపల్ ఎన్నికల్లో సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అనుకూలం: సీఎం రేవంత్
  • మున్సిపల్​ ఎన్నికల్లో  విజయం మనదే
  •         మంత్రులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి దిశా నిర్దేశం
  •     టికెట్ రికమండ్ చేసినోళ్లు గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి
  •     ప్రతి డివిజన్‌‌‌‌లో లోకల్ మేనిఫెస్టో రెడీ చేయాలని ఆదేశం
  •     నేడు సీఎం క్యాంపు ఆఫీసులో పీసీసీ చీఫ్, మంత్రులతో రేవంత్ భేటీ

హైదరాబాద్, వెలుగు:మున్సిపల్ ఎన్నికల్లో సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. సమన్వయంతో ముందుకెళ్తే భారీ విజయం ఖాయమని మంత్రులకు సూచించారు. సోమవారం మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి జూమ్ ద్వారా సమావేశమయ్యారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జీలుగా ఉన్న మంత్రులు, పీఏసీ సభ్యులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడారు. 

మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పార్టీ నుంచి రెబల్స్ లేకుండా చూసుకోవాలన్నారు. టికెట్ రానివారికి రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి, పోటీ నుంచి తప్పించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్లే కొన్ని  గ్రామాల్లో ఓడిపోయామని, అందుకే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రెబల్స్ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. కావాల్సినవారికి  టికెట్లు ఇప్పించుకుంటే సరిపోదని, వారిని  గెలిపించే బాధ్యతను కూడా తీసుకోవాలని అన్నారు. ప్రతి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  లోకల్ మేనిఫెస్టో రెడీ చేసుకొని జనంలోకి వెళ్లాలని సూచించారు. స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ జనంలో నమ్మం కలిగించాలన్నారు.

సామాజిక న్యాయం పాటించాలి 

అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాలని, జనరల్​స్థానాల్లో  బీసీలు, ఇతర సామాజికవర్గాలకు అవకాశం కల్పించాలని మంత్రులకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి​సూచించారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున ప్రతి నాయకుడు చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకొని కష్టపడి పనిచేయాలని కోరారు. పార్టీ అభ్యర్థులకు బీ ఫాంలను అందజేసే బాధ్యత డీసీసీ అధ్యక్షులదేనని  స్పష్టం చేశారు. ఈ నెల 4 నుంచి 9 వరకు తాను మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, వీటిని ఆయా నియోజకవర్గ నేతలంతా సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నేడు ప్రత్యక్ష భేటీ..

పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో మంగళవారం సాయంత్రం సమావేశం కావాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సీఎం రేవంత్ పాత క్యాంపు ఆఫీసులో ఈ సమావేశం జరగనుంది. దీనికి పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు మంత్రులు పాల్గొననున్నారు. మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో తాజా పరిస్థితులపై నివేదికలు సిద్ధం చేసుకొని రావాలని సీఎం ఆదేశించారు.