- నాడు పక్కా ఇండ్లు, రూ.2 కిలో బియ్యం..
- నేడు ఇందిరమ్మ ఇండ్లు, 3 కోట్ల మందికి సన్నబియ్యం: సీఎం రేవంత్
- రూ.50కే విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్
- ఎన్టీఆర్ ఒక కులం, ప్రాంతానికి పరిమితం కాదు..
- ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక
- ఎంతోమంది తెలంగాణ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దారు
- ఎవరేమనుకున్నా, కొందరు విమర్శలు చేసినా నేను భయపడను
- ముగ్గురు జాతిరత్నాలు అంబేద్కర్, ఇందిరమ్మ, ఎన్టీఆర్
- నాడు చంద్రబాబు హైటెక్ సిటీ.. నేడు మా 30 వేల ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ
- 2034 దాకా మాదే పాలన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం వెల్లడి
హైదరాబాద్, వెలుగు:ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఆశయాల కలయిక, స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన పక్కా ఇండ్ల పథకమే నేడు తాము ఇయ్యాల అందిస్తున్న ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకానికి మూలమని చెప్పారు.
అలాగే పేదవాడి ఆకలి తీర్చడం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చరిత్రాత్మక రెండు రూపాయల కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే, తమ ప్రభుత్వం ద్వారా 3 కోట్ల 24 లక్షల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. నాడు ఎన్టీఆర్ తెచ్చిన ‘జనతా వస్త్రాలు’ పథకమే నేడు తాము అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ చీరల’ పథకానికి దిక్సూచి అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని మైత్రివనం సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఆంధ్ర ప్రాంతానికో, ఒక కులానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహోన్నత శక్తి అని తెలిపారు.
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు కేవలం ఒక పేరు కాదని, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పానికి నిదర్శనాలని అన్నారు. ఎవరు ఏమనుకున్నా.. కొందరు విమర్శలు చేసినా ఈ విషయంలో తాను భయపడనని చెప్పారు. ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆరేనని అన్నారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితోనే రూపుదిద్దుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేదలు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం గ్రామాల్లోని పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన సాహసవంతుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నాడు ఎన్టీఆర్ వ్యవసాయానికి రూ.50 కే హార్స్ పవర్ విద్యుత్ అందించి రైతాంగాన్ని ఆదుకుంటే, నేడు తాము రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని వెల్లడించారు.
మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ భావిస్తే, ఆ నిర్ణయాన్ని ఆనాడు దేశంలోనే మొదటిసారిగా ఆచరణలో పెట్టి మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే నేడు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వండిమాండ్ చేస్తోందన్నారు.
- ఎన్టీఆర్ అంటే నీతి, నిజాయతీ, నిబద్ధత..
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు కేవలం ఒక పేరు కాదని, నీతి, నిజాయితీ, నిబద్ధత, ఉక్కు సంకల్పానికి నిదర్శనాలని సీఎం అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడని ప్రశంసించారు. అంబేద్కర్, ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ అనే ముగ్గురు నేతలను దేశంలో మానవ మనుగడ ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించడంపై కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడని స్పష్టం చేశారు.
అందుకే అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇటుగా వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈ విగ్రహం ఒక గొప్ప స్ఫూర్తిని రగిలిస్తుందని చెప్పారు. ఇందిరా గాంధీ అంటే కేవలం ఒక పేరు కాదు, ఆమె ఒక ఉక్కు మహిళ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఆనాడు రాజాభరణాలను రద్దు చేయడమే కాకుండా, భూస్వాములు, జమీందారుల చేతుల్లో బందీగా ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచేందుకు విప్లవాత్మక భూసంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఇందిరమ్మదేనని తెలిపారు. నిరంకుశ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన తెలంగాణ పేద ప్రజల ఆత్మగౌరవం కోసం ఆమె అసైన్‌మెంట్ పట్టాల రూపంలో భూమిపై హక్కును కల్పించారని పేర్కొన్నారు.
- 2034 వరకు అధికారంలో ఉంటాం
నాడు చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా హైటెక్ సిటీ నిర్మిస్తే, నేడు తాము 30 వేల ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పదేసి ఏండ్లు పాలించిన తరహాలోనే, ప్రజల మద్దతుతో తమ ప్రభుత్వం 2024 నుంచి 2034 వరకు నిరాటంకంగా అధికారంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్, సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, ఎంపీలు రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, జయవీర్ రెడ్డి, కాంగ్రెస్ నేత బండి రమేశ్ హాజరయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రామకృష్ణ, మోహనకృష్ణలతో పాటు సినీ నటుడు మంచు మనోజ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, పలువురు సినీ కళాకారులు పాల్గొన్నారు.
- కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే
తెలంగాణ సమాజానికి, రాజకీయాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు ఎనలేనివని సీఎం అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి, జానారెడ్డి, కడియం శ్రీహరి, మోత్కుపల్లి నర్సింహులు వంటి ఎంతోమంది తెలంగాణ బిడ్డలను ప్రోత్సహించి నాయకులుగా తీర్చిదిద్దింది ఎన్టీఆరేనని పేర్కొన్నారు. చివరకు కేసీఆర్‌కు కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనన్న విషయాన్ని ఎవరూ మరువరాదన్నారు.
ఎన్టీఆర్ నీడలో పెరిగి, ఆయన వల్ల రాజకీయంగా ఎదిగిన వారే ఈనాడు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటం సమంజసం కాదని మండిపడ్డారు. ఎన్టీఆర్ కల్పించిన రాజకీయ అవకాశాల వల్లే తెలంగాణలో బలహీన వర్గాలు, పేదలు శాసనసభ్యులుగా, మంత్రులుగా ఎదిగే అవకాశం లభించిందన్నారు.
- యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తమ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాడు ఎన్టీఆర్ యువకులకు, పేదలకు టిక్కెట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపినట్లే, నేడు తాము కూడా మందుల సామెల్, ఎడ్మా బొజ్జు వంటి సామాన్య నిరుపేదలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపిందని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో మొదటి సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 67 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టి యువతకు భరోసా ఇచ్చామన్నారు. నాడు చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను నిర్మించి ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారన్నారు. ఆ దారిలోనే తాము విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మిస్తున్నామని వివరించారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన సత్యా నాదెళ్ల, శంతను నారాయణ్, అజయ్ బంగా వంటి మహానుభావులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదువుకుని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా ఎదిగారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మన యువత కేవలం విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయడం కాదని, ప్రపంచ దిగ్గజ కంపెనీలనే తెలంగాణకు రప్పించి, మన యువతను వాటికి యజమానులుగా నిలబెట్టడమే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఆశీస్సులు, అన్న ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు.
