ఇవాళ(జూన్ 17న) ఆరుట్లలో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

ఇవాళ(జూన్ 17న) ఆరుట్లలో.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
  •  
  • రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ ముఖచిత్రాన్ని మార్చేలా సర్కార్ కీలక అడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ బుధవారం రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కూల్‌‌ను ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. సర్కారు విద్యలో సరికొత్త ‘గేమ్ చేంజర్’గా నిలవనున్న ఈ స్కూల్ ద్వారా పేద విద్యార్థులకు హైటెక్ చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మొదట స్కూల్ పైలాన్‌‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం స్కూల్‌‌లోని డిజిటల్ క్లాస్‌‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్‌‌ను పరిశీలిస్తారు. విద్యా వసతులపై విద్యార్థులు, టీచర్లు, స్కూల్ కమిటీ సభ్యులతో ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌‌ఫాస్ట్ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.   

నర్సరీ నుంచి ఇంటర్ వరకూ.. 

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని టీం ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల టీపీఎస్ రూపుదిద్దుకుంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌‌లో విద్య అందుతుంది. ఆ స్కూల్‌‌లో హైటెక్ వసతులు కల్పించారు. గాలి, వెలుతురు వచ్చే విశాలమైన గదులు, డిజిటల్ బోర్డులు, అత్యాధునిక ల్యాబ్స్, జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌‌బాల్, వాలీబాల్, టెన్నిస్, కబడ్డీ వంటి ఆటల కోసం ప్రత్యేక కోచ్‌‌లను నియమించారు.

విద్యార్థుల కోసం ఉదయం బ్రేక్ ఫాస్ట్,  మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. ఇంటి నుంచి స్కూలుకు రావడానికి 5 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. కాగా, సర్కారు బడులంటే ఒకప్పుడు వెనకడుగు వేసిన పేరెంట్స్.. ఇప్పుడు టీపీఎస్‌‌లో సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల స్కూల్లో 1,814 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రీ-ప్రైమరీలో150, ప్రైమరీలో 600, హైస్కూల్లో 800, ఇంటర్మీడియట్‌‌లో 264 మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి వలసలు పెరగడంతో ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం విశేషం. పైలట్ ప్రాజెక్టుగా ఆరుట్ల, మంచాల, వంగూరు, పోల్కంపల్లిలో వీటిని ప్రారంభించనుండగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 100 టీపీఎస్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.