- తొలి విడతలో 3 ఎకరాల్లోపు రైతులకు రూ.3,590 కోట్లు
- 70 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు 3 విడతల్లో పెట్టుబడి సాయం
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా మొదటి విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి పెట్టుబడి సాయంనిధులను సీఎం రేవంత్‌రెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 70 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు రెండు విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు.
తొలి విడతలో మూడు ఎకరాల్లోపు రైతులకు మొత్తం రూ.3,590 కోట్ల మేర నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రైతులపై ఆర్థిక భారం పడకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఈ ప్రక్రియను అత్యంత వేగంగా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఒకేసారి కాకుండా ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 3 విడతల్లో పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయనున్నారు.
తొలి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత.. రెండో విడత కింద మరో రూ.2,650 కోట్లను విడుదల చేసేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా చెల్లించి, ఈ సీజన్‌కు సంబంధించిన పంపిణీని 100 శాతం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికిగానూ మొత్తంగా రూ.9 వేల కోట్లను3 దశల్లో బదిలీ చేయనున్నారు. ఎకరానికి ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తుండగా, ఈ ప్రస్తుత సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల చేతికి అందనున్నది.
రైతు భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నిధుల సమీకరణ, లబ్ధిదారుల తుది జాబితాపై లోతుగా చర్చించారు. పంపిణీలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
నిధుల లభ్యత, రైతుల డేటా బేస్ అనుసంధానంపై వీరు ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించారు. ముందుగా చిన్న, సన్నకారు రైతులకే ప్రాధాన్యం ఇస్తూ ఎకరం లోపు వారితో పంపిణీ ప్రారంభించడం సామాజిక న్యాయం పాటించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ భారీ నిధుల రాకతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు లభించడమే కాకుండా, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు.
