- మనకున్న రిసోర్స్‌ల ద్వారానే టెక్నికల్
- చాలెంజ్లనుఅధిగమించాలి: సీఎం రేవంత్
- సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం దొరికినట్లే
- పోలీసింగ్‌లో హ్యూమన్ టచ్ ఉండాలి.. పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- రాజకీయ ప్రమేయం లేకుండా పోలీసులకు పోస్టింగ్స్.. ఆటో మోడ్.. ఆటో ప్రమోషన్స్ ఉండవు
- శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాలకే పెట్టుబడులు వస్తాయని వెల్లడి
- పోలీస్ రిట్రీట్ సదస్సులో సీఎం రేవంత్ ప్రసంగం..
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం నేర స్వరూపం మారిపోయిందని, కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వీటిని దీటుగా ఎదుర్కొనేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. మనకున్న రిసోర్సుల ద్వారా మాత్రమే టెక్నికల్ చాలెంజెస్‌ను అధిగమించగలమని చెప్పారు. సోమవారం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అకాడమీలో జరిగిన ‘పోలీస్ రిట్రీట్---2026’ సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్‌తో కలిసి పోలీస్ సమస్యలు, సవాళ్లు, టెక్నాలజీ గురించి సీఎం రేవంత్చర్చించారు. ప్రస్తు త సాంకేతిక యుగంలో సవాల్‌గా మారిన సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్ డ్రగ్స్, విమెన్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సహా వివిధ అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలించారు. రెండు రోజుల సదస్సులో లేవనెత్తిన అంశాలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఏ ఆపతి వచ్చినా సాయం కోసం ప్రజలు చూసేది పోలీస్ వైపేనని అన్నారు.
సిస్టంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట బద్నామ్ అయ్యేది కూడా పోలీస్ వ్యవస్థనే అని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విధి నిర్వహణలో పోలీస్ అధికారులకు ఎదురయ్యే సవాళ్లను గుర్తించినప్పుడే సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. “ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మీరంతా చర్చించారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర అధికారులు.. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీస్‌శాఖలో అధికారుల విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించేందుకు చేసిన మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటేనే.. ఎక్కడికి చేరుకోవాలన్నది తెలుస్తుంది. 2002లో పోలీస్ రిట్రీట్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, నూతన నేరాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి యువ అధికారులకు 2025లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాం.. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడింది” అని పేర్కొన్నారు.
కేటగిరీల వారీగా పోలీసు అధికారుల లిస్ట్..
పోలీస్ శాఖలో కేటగిరీలవారీగా అధికారుల లిస్ట్ తన దగ్గర ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా పోస్టింగ్స్ ఇస్తున్నామని చెప్పారు. ఈ రెండేండ్ల వ్యవధిలో 90 శాతం మంది అధికారులు ఎవరికి పోస్టింగ్ వస్తుందో టీవీల్లోనే చూసుకున్నారని అన్నారు. ఏ, బీ, సీ కేటగిరీలవారీగా అధికారుల లిస్ట్ తయారు చేశామని, దానికి తగ్గట్టుగానే వారికి పోస్టింగ్స్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర శాఖల్లో మాదిరిగా పోలీస్ శాఖలో ఆటోమోడ్.. ఆటో ప్రమోషన్స్ ఉండవని చెప్పారు. పోలీసులకు ఉండాల్సిన లక్షణం సమస్యను అర్థం చేసుకోవడమేనని, 50 శాతం పరిష్కారం అక్కడే దొరుకుతుందని చెప్పారు. పోలీసుల ముందు టెక్నిక ల్, అడాప్టివ్ చాలెంజ్ అనే రెండు సమస్యలున్నాయని, వాటిని అధిగమించాలని సూచించారు. పోలీసింగ్‌లో ఏఐని వినియోగించాలన్నారు. “పోలీసు అధికారుల్లో సమన్వయం లేకుండా పోయింది. అన్ని విభాగాలతో రాష్ట్ర వ్యాప్త డేటా పొందుపరచండి. డిపార్ట్‌మెంట్లలో కూడా అనేక ల్యాప్స్ ఉన్నాయి. సిటీలో ట్రాఫిక్ అతిపెద్ద సమస్య. ప్రజల్లో మార్పు రానంత వరకు పరిష్కారం కాదు. ట్రాఫిక్‌లో పక్కాగా పోలీస్ సిబ్బందిని రేషనలైజేషన్ చేశాం. కూబింగ్ పోయింది కాబట్టి గ్రేహౌండ్స్‌లో ఉన్న సిబ్బందిని మరో చోట వాడుకోవాలి”అని సూచించారు. కాగా, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని చెప్పారు.
పోలీసింగ్‌లో హ్యూమన్ టచ్ ఉండాలి..
హైదరాబాద్‌లో అతిపెద్ద సమస్యల పరిష్కారం కోసం హైడ్రాను తీసుకువచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పోలీసు విచారణ సందర్భంగా సేకరిస్తున్న సమాచారాన్ని స్టోర్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరం జరిగినా ఆ సమాచారం ఇక్కడ నిక్షిప్తం చేసి.. భవిష్యత్తు దర్యాప్తులో దాన్ని టెక్నాలజీ సాయంతో వాడుకోవాలన్నారు. “హ్యూమన్ టచ్ అనేది పోలీసింగ్‌లో చాలా ముఖ్యం.
మనతో పనిచేసే సిబ్బంది గౌరవాన్ని, అవసరాన్ని గుర్తించి సాయం చేస్తే వాళ్లు మన కోసం వందశాతం పనిచేస్తారు. సూపర్‌బాస్‌లు అనుకునే వాళ్లకు కూడా నా సూచన ఇది. ఇప్పటికీ నేను సర్పంచ్‌లతోనూ మాట్లాడుతూ.. నిర్ణయాల్లో మార్పులు చేసుకుంటా. వినడం అనేది చాలా ముఖ్యం. వింటేనే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పోలీసు అధికారులుగా సమాజంలో మీ బాధ్యత పెరిగింది. మన్‌కీ బాత్‌లో ఆయన (ప్రధాని మోదీ) చెప్పేది ఒకసైడే వినాల్సి ఉంటది. మనం చెప్పేది ఉండదు’’ అని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో వచ్చిన మార్పులకు ఈ వ్యవస్థలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ‘‘గతంలో పోలీస్ మ్యానువల్‌ను అప్పటి నేరాలకు అనుగుణంగానే రాసుకున్నాం. ఈ రోజుల్లో సైబర్ క్రైం, డ్రగ్స్, డార్క్ వెబ్‌సైట్స్.. ఇలా నేర స్వరూపమే మారిపోయింది. ఎక్కడ కూర్చొనైనా మొబైల్ ద్వారా సైబర్‌నేరాలు, డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొత్త సమస్యలు పరిష్కరించేలా పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి. అందుకు ఈ రిట్రీట్ ఉపయోగపడుతుంది. నార్కోటిక్స్, సైబర్‌క్రైమ్‌లో ఇచ్చిన ప్రతిపాదనలు చట్టం రూపంలోకి తేవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యలు తలెత్తకుండా చూడాల్సి ఉంది. డీజీపీ, సీఎస్, చైర్మన్, లా సెక్రెటరీ, ఆర్థిక సెక్రటరీ, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీతో కమిటీ ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.
లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు
ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుండాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అలాంటి రాష్ట్రాల్లోనే పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం కొన్ని పాలసీలను తెచ్చిందని తెలిపారు. ‘‘ 2047లో 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ జనాభాలో 2 శాతం ఉన్నా.. జీడీపీలో 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం. 100 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలకు తెలంగాణ సాంకేతికంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలన్నాదే నా లక్ష్యం. గ్లోబ్‌లో 500 కంపెనీల్లో 100 కంపెనీలు మనం నిర్వహించిన గ్లోబల్ సమిట్‌లో పాల్గొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2,100 చదరపు కిలోమీటర్లు కోర్ అర్బన్ ఏరియాలో అభివృద్ధి పెరగాలి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీకి పేరువచ్చింది. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడమే దీనికి కారణం. బెంగళూరు ఎంతో అభివృద్ధి చెందినా.. ట్రాఫిక్ చిక్కులు ఉన్నాయి. ముంబై ఆర్థిక రాజధాని అయినా.. అక్కడ వర్షం వస్తే అతలాకుతలం.. చెన్నైలోనూ వర్షాలు.. కోల్‌కతాలో శాంతిభద్రతలు సహా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ నగరాలన్నింటినీ చూసి హైదరాబాద్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది” అని అన్నారు.
