గురుకులాల నిర్వీర్యానికి సీఎం కుట్ర.. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

గురుకులాల నిర్వీర్యానికి సీఎం కుట్ర.. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన గురుకుల విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ జడ్పీ చైర్‌‌‌‌పర్సన్ వసంతతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను 296 నుంచి 613కు పెంచి అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పాత స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించకుండా, వసతులు కల్పించకుండా ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్’ పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. 

ఈ స్కూళ్ల విధివిధానాలు, నియామక ప్రక్రియపై స్పష్టత లేదని, కేవలం కొందరు కాంట్రాక్టర్లకు వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు.  జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు అవసరమైతే 2 ఎకరాలు, యంగ్ ఇండియా స్కూల్‌‌‌‌కు 20 ఎకరాలు అవసరమైతే 10 ఎకరాలకే పరిమితం చేయడం దారుణమన్నారు.