కొత్వాల్‌‌ గూడ ఎకో పార్క్‌‌ను ప్రారంభించనున్న సీఎం

కొత్వాల్‌‌ గూడ ఎకో పార్క్‌‌ను ప్రారంభించనున్న సీఎం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టూరిజం అభివృద్ధిలో భాగంగా హెచ్‌‌ఎండీఏ కొత్వాల్‌‌గూడలో నిర్మించిన ఎకో పార్క్ నిర్మాణం పూర్తయింది. ఈ పార్క్‌‌ను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. హిమాయత్‌‌సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్క్‌‌ను నిర్మించారు. సుమారు రూ.75 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పార్క్‌‌లో సందర్శకులను ఆకర్షించే అనేక ప్రత్యేక  ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా ‘అడ్వెంచర్స్’ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన పార్క్‌‌లలో ఒకటిగా ఎకో పార్క్​నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. భారీ సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నగరాన్ని సందర్శించే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితాలో ఈ ఎకో పార్క్‌‌కు ప్రత్యేక స్థానం దక్కుతుందని అధికారులు పేర్కొన్నారు.

సందర్శకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహ్లాదంగా గడిపేలా పార్క్‌‌ను విభిన్న ఆకర్షణలతో తీర్చిదిద్దారు. ఇందులో ప్రధానంగా బోర్డ్ వాక్, బర్డ్స్ ఎవియరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, బటర్‌‌ఫ్లై గార్డెన్, గ్రీనరీ అండ్ ల్యాండ్‌‌స్కేప్, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, అరైవల్ ప్లాజా, ఎంట్రెన్స్ ఆర్చ్ వంటివి ఉన్నాయి. సందర్శకులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన బోర్డ్ వాక్ నిర్మించారు. అలాగే 6,500 రకాల పక్షులు కనువిందు చేయనున్నాయి. ముఖ్యంగా బటర్‌‌ఫ్లై గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అధికారులు తెలిపారు. 

ఆరు ఎస్టీపీలకు నేడు ప్రారంభోత్సం.. 39 కొత్త  ఎస్టీపీలకు శంకుస్థాపన

హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంబర్ పేట్ తో పాటు మరో ఐదు మురుగు నీటి శుద్ధి కేంద్రాలను  సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిని రూ.3849.10 కోట్లతో నిర్మించనున్నారు.

8న బుమృక్ ఉద్దౌలా చెరువు..

అలాగే ఈ నెల 8న ఓల్డ్ సిటీలోని బుమృక్ ఉద్దౌలా చెరువు, 9న కూకట్‌‌పల్లి నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాతబస్తీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా బమృక్​ ఉద్దౌలా చెరువు వద్ద ప్రధాన ద్వారం, చరిత్ర వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం వీటిని పరిశీలించారు. తర్వాత పోలీసు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.