తమిళ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. ప్రముఖ దర్శక దిగ్గజం, నటుడు భారతీరాజా బుధవారం కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ క్రమంలోనే దర్శకుడు భారతీరాజా మృతి పట్ల తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి, భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సమయంలో సీఎం విజయ్ భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భారతీరాజా కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపాన్ని తెలియజేశారు.
గురువులాంటి వ్యక్తిని కోల్పోవడం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని విజయ్ పేర్కొన్నారు. ఆయన మరణం కేవలం సినీ రంగానికే కాకుండా, భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి పెద్ద నష్టమని అభిప్రాయపడ్డారు.
Cm Vijay paid his final respects for veteran director #BharathiRaja pic.twitter.com/tC2lEr8Tk7
— Vijay Fans Trends (@VijayFansTrends) June 10, 2026
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ని తనదైన సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు భారతీరాజా. ఆయన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. 'పదహారేళ్ల వయసు' (1978), సీతాకోకచిలుక (1981), ఆరాధన (1987) వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలతో చిరస్థాయిగా నిలిచారు.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా విశిష్ట గుర్తింపు సంపాదించి, తరతరాల సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. భారతీరాజా మరణంతో తమిళ సినీ పరిశ్రమలో ఒక స్వర్ణయుగానికి తెరపడిందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
