విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్

విజయవాడలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్

విజయవాడ: మన దేశ  74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్‌ జగన్‌ వీక్షించారు.  సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ‘స్వాతంత్ర సమర యోధులకు పాదాభివందనం. స్వాతంత్రం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారని ప్రస్తావించారు.  రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం… ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని సీఎం జగన్ సూచించారు.

ట్విట్టర్ ద్వారా వీరులకు శతకోటి వందనాలు తెలిపిన వైఎస్‌ జగన్‌..

మన దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భారతీయులకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.’ ఈరోజు మనం ఆనందించే స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిన వీరులకు నా శతకోటి వందనాలు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలను అర్పించి దేశ భక్తిని మరింత పెంపొందించారు. మన దేశం విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశ ప్రతిష్టను రక్షించడానికి ప్రతిజ్ఞ చేద్దాం.. దాని పురోగతికి దోహదం చేద్దాం. జై హింద్!’ అంటూ ఉద్వేగంగా పేర్కొన్నారు.