V6 News

ఉదయం 6 గంటలకే పారిశుధ్య హాజరు.. గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు: సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు

ఉదయం 6 గంటలకే పారిశుధ్య హాజరు.. గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవు: సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో పారిశుధ్య నిర్వహణపై కమిషనర్ సృజన శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే సిబ్బంది, వాహనాల హాజరు నమోదు కావాలని, విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వార్డుల వారీగా రోడ్ల పొడవును బట్టి సిబ్బందికి బాధ్యతలు కేటాయించాలని, ఊడ్చిన చెత్తను వెంటనే తరలించాలని ఆదేశించారు. 

దోమల నివారణకు యాంటీ లార్వా చర్యలు చేపడుతూ, ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని సూచించారు. ఇంటి వద్దే చెత్త వర్గీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, హేమంత్ సహదేవరావు, సందీప్ కుమార్ ఝాకు దిశానిర్దేశం చేశారు.