హాస్పిటల్స్ లో చేరిన పేదోళ్లకు సీఎంవో సాయం అందట్లే..!

హాస్పిటల్స్ లో చేరిన పేదోళ్లకు సీఎంవో సాయం అందట్లే..!

హైదరాబాద్‌, వెలుగు: కూకట్‌పల్లికి చెందిన వాసం రవీందర్‌ది పేద కుటుంబం. 4 రోజుల కిందట అర్ధరాత్రి భరించలేని కడుపునొప్పి రావడంతో అక్కడా ఇక్కడా తిరిగాడు. ఏ హాస్పిటల్‌ దొరకలేదు. దీంతో ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చేరాడు. కిడ్నీ ప్రాబ్లమ్‌ అని.. ట్రీట్‌మెంట్‌కు రూ. 5.75 లక్షలవుతుందని హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పింది. ఏం చేయాల్నో అర్థం కాలేదు. ఓ ఫ్రెండ్‌ను బతిమిలాడాడు. హైదరాబాద్‌లోని ఓ ఎమ్మెల్సీ ద్వారా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌కు అప్లయ్‌ చేసేందుకు ట్రై చేశాడు. ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన లెటర్‌ను ఆయన పర్సనల్‌ స్టాఫ్‌ సీఎంవోలోని ఎల్వోసీ సెక్షన్‌కు తీసుకెళ్లారు. కానీ వాళ్లు దాన్ని తీసుకోలేదు. బతిమిలాడగా చూసి ప్రైవేట్‌ హాస్పిటల్‌కు ఇవ్వలేమని రాసి తిరిగిచ్చేశారు.

వేరే హాస్పిటల్‌కు లేదంటున్నరు

అర్జెంట్‌ టైమ్‌లో జనానికి ట్రీట్‌మెంట్‌ కోసం సాయమందించే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్వోసీ)ని రాష్ర్ట సర్కారు ఆపేసింది. ఒక్క నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తప్ప ఏ హాస్పిటల్‌కు ఇవ్వడంలేదు. 10 రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నుంచి స్టాఫ్‌ ఎల్వోసీ కోసం సీఎంవోకు వెళ్తే నిమ్స్ తప్ప వేరే దానికి ఇవ్వలేమంటున్నారు. నిమ్స్ నుంచి ఇచ్చిన పేపర్లనే తీసుకుని, మిగిలిన ఆస్పత్రులవి కొట్లేసినట్టు మార్క్ వేసి ఇస్తున్నారు. కరోనా బాధితులు భారీగా పెరుగుతున్న ఈ టైమ్‌లో ప్రభుత్వం ఎల్వోసీ ఆపేయడంతో వేల మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏ ట్రీట్‌మెంట్‌కూ ఎల్వోసీ ఇవ్వట్లేదని, తమ దగ్గరికి వచ్చే వాళ్లకు ఏం చెప్పాల్నో అర్థమవట్లేదని హైదరాబాద్‌కు చెందిన ఓఎమ్మెల్యే చెప్పారు.

మెల్లమెల్లగా తగ్గిస్తూ..

ఆరోగ్యశ్రీ లేని వాళ్లు, ప్రభుత్వం అర్హులుగా తేల్చినా తెల్ల రేషన్ కార్డు అందని వాళ్లకు, అధిక ఖర్చు భరించలేనివాళ్లకు సర్కారు ఎల్వోసీ పెద్ద ఆసరాగా ఉండేది. అయితే ప్రభుత్వం రెండేండ్లుగా ఎల్వోసీ ఇచ్చే ఆస్పత్రుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. గతంలో ప్రతి నెలా సగటున 7, 8 లక్షల మందికి ఎల్వోసీ ఇచ్చేవారు. గతేడాది నుంచి ఇది 2, 3 లక్షలకు తగ్గింది. ఇప్పుడైతే వందల్లోనే ఉంది. ప్రస్తుతం సగటున 2,500 వరకు ఎల్వోసీకి అప్లికేషన్స్‌ వస్తుండగా కరోనా వల్ల రెట్టింపయ్యాయి. ఈ టైమ్‌లోనే ప్రభుత్వం ఎల్వోసీని ఆపేసింది. ఆరేండ్లలో రూ. 1,100 కోట్లను సర్కారు ఎల్వోసీకి ఖర్చు పెట్టింది.

ఏంటీ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌?

హాస్పిటల్‌లో చేరాక పేషెంట్‌ ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చవుతుందనే అంచనాతో ఆ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌ ఓ ప్రపోజల్ ఇస్తుంది. దాని ఆధారంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్వోసీ) కోసం ప్రభుత్వానికి లెటర్ రాస్తారు. ప్రభుత్వం పరిశీలించి బిల్లులో ఎంత మొత్తం ఇస్తామో పేర్కొంటూ ఎల్వోసీ ఇస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం