గుడ్డిగా తింటే ఆస్పత్రికే : జూబ్లీహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక

గుడ్డిగా తింటే ఆస్పత్రికే : జూబ్లీహిల్స్ లోని ప్రముఖ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక

హైదరాబాద్ అంటే బిర్యానీ..  బిర్యానీ అంటే గుర్తొచ్చేది కూడా హైదరాబాదే.  అయితే ఇప్పుడు హైదరాబాద్ లో  బిర్యానీ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి  ఏర్పడింది.  ఎందుకంటే వరుసగా సంఘటనలే దానికి కారణం.  హైదరాబాద్​ బిర్యానీలో కీటకాలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో వడ్డించిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.  

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లలో అపరిశుభ్రమైన బిర్యానీ అందిస్తున్నారనే ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల, రాజేంద్రనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో కస్టమర్‌కు వడ్డించిన బిర్యానీలో బల్లి తోక కనిపించింది.  గతంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఆర్డర్‌ చేసిన బిర్యానీలో బల్లి చనిపోయినట్లు కస్టమర్ గుర్తించారు. 

ఇలా వరుస  ఘటనలతో  రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటేనే ఆందోళన కలిగిస్తుంది. నగరంలోని అన్ని రెస్టారెంట్లు పరిశుభ్రత విధానాలను పాటించేలా GHMC ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వరుసగా వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై పెరుగుతున్న ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోచూడాలి.