బొగ్గులతో చలి మంట.. పొగకు ఊపిరాడక విజయ డెయిరీ కార్మికుడి మృతి!

బొగ్గులతో చలి మంట..  పొగకు ఊపిరాడక విజయ డెయిరీ కార్మికుడి మృతి!
  •  మరొకరి పరిస్థితి విషమం
  • మృతుడి కుటుంబానికి  ఎక్స్​గ్రేషియా చెల్లించాలంటూ  డిమాండ్‌ కార్మికుల ఆందోళన

సికింద్రాబాద్​, వెలుగు : బొగ్గులతో చలి మంట వేసుకుని పొగకు ఊపిరాడక లాలాపేటలోని విజయ డెయిరీలో  ఓ కార్మికుడు చనిపోయాడు.  మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది.తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...  లాలాపేటలోని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ)లో బాయిలర్ సెక్షన్‌లో క్యాప్సన్‌  మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు.  బిహార్ రాష్టంలోని హిరోవులీ గ్రామానికి  చెందిన  మనోజ్ కుమార్ (30) అక్కడ ఫైర్​మన్​గా 2009 నుంచి  పనిచేస్తున్నాడు. ఇదే సెక్షన్​లో శంకర్(35) అనే వ్యక్తి (35) ​ బాయిలర్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. శంకర్, మనోజ్​ కుమార్ ఇద్దరూ బుధవారం రాత్రి  డెయిరీ ప్లాంట్‌లో  డ్యూటీ చేస్తున్నారు.  గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు తోటి కార్మికులతో మాట్లాడి.. ఆ తర్వాత అక్కడే ఉండే ఓ రూమ్​లోకి వెళ్లారు.  చలి ఎక్కువగా ఉండటంతో బొగ్గులతో మంట పెట్టుకుని కాచుకొన్నారు.  గురువారం ఉదయం 6 గంటలకు తోటి కార్మికులు ఆ రూమ్​లోకి వెళ్లి చూడగా..  మనోజ్​ చనిపోయి ఉన్నాడు. మరో కార్మికుడు శంకర్ అపస్మారక స్థితిలో ఉండటంతో అతడిని వెంటనే గాంధీ హాస్పి టల్​కు తరలించారు. బొగ్గులతో చలిమంట వేసుకుని ఆ పొగకు ఊపిరాడక నిద్రలోనే మనోజ్ చనిపోయి ఉంటాడని కొందరు కార్మికులు భావిస్తున్నారు. అయితే, పాము కాటు వల్ల మనోజ్ చనిపోయాడని మరికొందరు చెబుతున్నారు. అయితే,   డ్యూటీలో ఉన్న కార్మికులు ఏం చేస్తున్నారని పర్యవేక్షించాల్సిన సంస్థ జీఎం, ఏజీఎం సంబంధిత అధికారులు లేకపోవడంతోనే మనోజ్ మృతి చెందాడని తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని విజయ డెయిరీ అధికారులను కార్మికులు డిమాండ్ చేశారు. విజయ డెయిరీలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఏజెన్సీల ద్వారా వచ్చి మ్యాన్ పవర్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్నాని ఆరోపించారు. మనోజ్​కు భార్య, కూతురురూప(5),  కొడుకు విష్ణు(2) ఉన్నారు.  ప్రస్తుతం మనోజ్​ భార్య 6 నెలల గర్భిణి అని కార్మికులు తెలిపారు.   

కాంట్రాక్టర్  ఘెరావ్..

అధికారుల నిర్లక్ష్యం వల్లే మనోజ్​ మృతి చెందాడని,  మృతుడి కుటుంబానికి ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ తోటి కార్మికులు ఆందోళనకు దిగారు.  ఘటనా స్థలానికి  వచ్చిన కాంట్రాక్టర్​ తాను డబ్బులు ఇవ్వలేనని తెలిపాడు.  ఇన్సూరెన్స్​ కట్టామని..  ఆ డబ్బులు  వస్తేనే ఇస్తామంటూ కాంట్రాక్టర్​ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కార్మికులు అతడి​ వాహనాన్ని చుట్టుముట్టి ఘెరావ్​ చేశారు. అధికారులు స్పందించి మనోజ్ కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు కోరారు.