ఎన్నికల కోడ్ ​బ్రేక్ చేస్తే సీరియస్ యాక్షన్ : అమోయ్ కుమార్

ఎన్నికల కోడ్ ​బ్రేక్ చేస్తే సీరియస్ యాక్షన్ : అమోయ్ కుమార్
  • మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్

శామీర్ పేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రాగా.. మేడ్చల్ జిల్లాలో  ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అధికారులు వ్యవహరించాల్సి ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టంచేశారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రత్యేక నిఘా పెట్టాలని, అధికారులు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక , అతి సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలనిపేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి,  జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో ఎన్నికల మీడియా సెంటర్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్​లోని జీ–36లో  ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు  ప్రత్యేకంగా మీడియా సెంటర్​ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కలెక్టరేట్​లో మీడియా సెంటర్​ను జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియతో కలిసి ఆయన ఓపెన్ చేయించారు.  

రంగారెడ్డి జిల్లా ప్రజావాణికి 304 అర్జీలు

రంగారెడ్డి కలెక్టరేట్ : సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 304 అర్జీలు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.