గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి :  కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 

ఖమ్మం టౌన్, వెలుగు : గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సర్పంచులకు సూచించారు. నగరంలోని డీపీఆర్ సీ సెంటర్ లో నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. రాబోయే ఐదేండ్లు సర్పంచులు బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. ప్రతిరోజు చెత్త సేకరణ సజావుగా జరుగుతుందా..? పారిశుధ్యం నిర్వహణ ఎలా ఉంటుంది..? అనే అంశాన్ని సర్పంచ్ పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు.

గ్రామ అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. పంచాయతీ నిధులు ఎలా ఖర్చు చేయాలో పటిష్ట కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు రెగ్యులర్ గా సమావేశాలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల్లో పన్ను వసూళ్లపై శ్రద్ధ పెట్టాలని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పన్ను కట్టేలా ప్రోత్సహించాలని తెలిపారు. ఎక్కడైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి

స్టేట్ మీట్ లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సీఎం కప్ బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ ను మేయర్ నీరజతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి అర్చరీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్​ అందజేశారు.