ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అధికారులతో ప్రాజెక్టుల భూసేకరణ, రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జ్, ఎన్నెస్పీ భూముల ఫెన్సింగ్, సింథటిక్ ట్రాక్, వెలుగుమట్ల, రోప్ వే తదితర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మిగులు భూసేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.
యాతలకుంటకు సంబంధించి మిగులు భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని, గ్రామ సభలకు ఇరిగేషన్ అధికారులు హాజరుకావాలని చెప్పారు. మున్నేరు, పాలేరు ప్రాజెక్టులకు సంబంధించి సర్వే కొనసాగుతోందన్నారు. రిటైనింగ్ వాల్ కు సంబంధించి భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 17 కిలో మీటర్ల వాల్ నిర్మాణానికి 9 కిలో మేటర్ల మేర నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
మిగులు భూ సేకరణలో 60 శాతం భూ యజమానులు పనులు చేపట్టేందుకు అంగీకారం తెలిపారని చెప్పారు. 5 కిలో మీటర్ల మేర వాల్ నిర్మాణానికి లక్ష క్యూబిన్ మీటర్ల మెటీరియల్సిద్ధం చేశామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, యాకుబ్, వెంకట్ రెడ్డి, రంజిత్, ఎస్డీసీ రాజేశ్వరి, డీఈవో చైతన్య జైనీ, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి..
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఫార్వర్డ్చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో యాసంగి ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు డాక్టర్. పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
