- గ్రామాల్లో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పర్యటన
కడెం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి పెంబి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. కోలంగూడాలో మొక్కలు నాటారు. అక్కడ నుంచి రోడ్డు సౌకర్యం లేని పలు గ్రామాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులతో కలిసి బైక్‌పై తిరిగారు.
ఇటిక్యాల తండా, కోలం గూడా, చాకిరేవు, గమ్మెన ఎంగ్లాపూర్, ధూందారి, చేర్యాల కడెం మండలంలోని మిద్దెచింతల, అల్లంపల్లి, ఇస్లాంపూర్, అడ్డాల తిమ్మాపూర్, తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలకు మెరుగైన కమ్యూనికేషన్ కోసం సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని, సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోసారి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి అటవీ అనుమతుల కారణంగా ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను వివరిస్తామని చెప్పారు.అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.
