ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి :  కలెక్టర్ హైమావతి
  •     కలెక్టర్ హైమావతి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజల నుంచి 126 అర్జీలను స్వీకరించారు. అనంతరం వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలి..

అన్ని ప్రభుత్వ బడులు, గురుకుల, కస్తూర్బా విద్యాలయాలు, సంక్షేమ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే రిపేర్లు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని డీఈవో, గురుకులాల జిల్లా కో ఆర్డినేటర్లను ఆదేశించారు. 

సత్యసాయి సేవా ట్రస్ట్ వారి సహకారంతో జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య అధికారులను ఆదేశించారు.

సంగారెడ్డి ప్రజావాణికి 42 అర్జీలు 

సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి వచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఆమె అడిషనల్ కలెక్టర్లు మాధురి, డీఆర్ఓ పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, ఆసరా పింఛన్లు, ఉద్యోగ కల్పన అంశాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కు అందజేశారు. 

వాటిని వెంటనే పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 42 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ ఏఓ పాల్గొన్నారు. 

మెదక్​ ప్రజావాణికి 64 దరఖాస్తులు 

మెదక్​ టౌన్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులకు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​అధికారులకు సూచించారు. మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో కలిసి మొత్తం 64 దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. వాటిలో భూ సంబంధిత దరఖాస్తులు 32, పెన్షన్ 10, ఇందిరమ్మ ఇండ్లు 2, ఇతరాలు18 వచ్చినట్లు తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.