ఒక్క సిలిండర్ ఉన్న వారికే ప్రయార్టీ... ఆందోళనతో ఎక్కువ బుక్ చేస్కుంటున్నరు :కలెక్టర్ హరిచందన దాసరి 

ఒక్క సిలిండర్ ఉన్న వారికే ప్రయార్టీ... ఆందోళనతో ఎక్కువ బుక్ చేస్కుంటున్నరు :కలెక్టర్ హరిచందన దాసరి 
  • ప్రభుత్వ హాస్టల్స్, దవాఖానలు, అంగన్​వాడీలకు నిరంతర సరఫరా 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒక్క సిలిండర్ కనెక్షన్ ఉన్న కుటుంబాలకు ముందుగా ఎల్పీజీ సరఫరా చేయాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలపై ఏజెన్సీ నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఒక్క సిలిండర్ ఉన్న వారికి సరఫరా చేసిన తర్వాతే రెండో సిలిండర్ ఉన్న వారికి ఇవ్వాలని సూచించారు. 

జిల్లాలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదన్నారు. జిల్లాలో సుమారు 18.62 లక్షల గృహ ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, 69 ఎల్పీజీ కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో ఆందోళన కారణంగా ఇటీవల డొమెస్టిక్ ఎల్పీజీ బుకింగ్స్ తాత్కాలికంగా పెరిగి రోజువారీ సగటును మించాయని చెప్పారు. వచ్చే 15 రోజుల్లో సరఫరాను మరింత పెంచాలని ఆదేశించారు. షేక్‌‌‌‌‌‌‌‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో నమోదైన ఘటనల్లో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ హాస్టళ్లు, హాస్పిటల్స్​, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకు నిరంతర సరఫరా ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 180042500333 లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 7416687878కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.