టేకులపల్లి, వెలుగు : బయోచార్ పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. టేకులపల్లి మండలం బేతంపూడి, తొమ్మిదవ మైలుతండా గ్రామాల్లో బయోచార్ (పత్తి కట్టె నుంచి బొగ్గు తయారీ) విధానంపై గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట సాగులో అధునిక పద్ధతులు నేర్చుకోవాలని సూచించారు. ప్రతి రైతు కుటుంబానికి 3 నుంచి 4 పద్ధతుల ద్వారా నిరంతరం ఆదాయం వచ్చే మార్గాలు ఎంచుకోవాలని చెప్పారు.
ముఖ్యంగా కౌజు పిట్టల పెంపకం, మునగ తోట, చేప పిల్లలు, పుట్టగొడుగులు, తేనెటీగలు, కూరగాయలు, మేకల పెంపకం వంటి వనరుల ద్వారా అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. రైతు భద్రం చేనులో బయోచార్ బొగ్గు తయారీ విధానాన్ని రైతులకు వివరించారు. అనంతరం రైతు చేనులో ఏర్పాటు చేసిన అజోళ్ల పెంపకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందన, ఎంపీడీవో బైరు మల్లేశ్వరి, తహసీల్దార్ వీరభద్రం, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
