సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్స్తో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఏంజీఎన్ఆర్ఈజీఎస్ పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కూల్ కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ఈజీఎస్ పనులు పూర్తి చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనులు వెంటనే మొదలు పెట్టి, పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభించిన పనులు ఈ నెల చివరికి పూర్తి చేయాలన్నారు. డీఆర్డీవో జయదేవ్ ఆర్య, పీఆర్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ జిల్లా అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.
పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు కలెక్టర్ కె హైమావతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు. చేర్యాల మున్సిపాలిటీకి 122 మందిని, హుస్నాబాద్ మున్సిపాలిటీకి 200, దుబ్బాక మున్సిపాలిటీకి 205, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 364 మందిని కేటాయించామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి 20 శాతం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు చెప్పారు. వీరికి ఈ నెల 7న శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
