కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ మార్కెట్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 23 నుంచి 30వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆలయ చైర్మన్లు, దేవాదాయ అధికారులు, అర్చకులతో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాలు, క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ట్రాఫిక్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ తదితర విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో సుధాకర్, అర్చకులు పాల్గొన్నారు.
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
కొత్తపల్లి, వెలుగు: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ స్కూల్‌ను గురువారం ఆమె సందర్శించారు. తరగతి గదులు, డైనింగ్ హాల్, కంప్యూటర్ గది, హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థులు ఏ ఏ రంగాల్లో ఉత్సాహంగా ఉన్నారో తెలుసుకుని శిక్షణ ఇప్పించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
బధిర విద్యార్థులు సైతం విభిన్న రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్, కంప్యూటర్ రంగంలో శిక్షణ ఇస్తున్నామని, ఇందుకు ఒకేషనల్ టీచర్లను నియమించినట్లు పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్ర కో ఆర్డినేటర్ రాంబాబు, ప్రిన్సిపాల్ భాస్కర్, మ్యూజిక్ టీచర్ సరళ పాల్గొన్నారు.
