కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. గురవారం సిటీలోని కరీంనగర్ ఎంసీహెచ్‌లో కలెక్టర్ తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైనకాలజిస్టులు, అనస్తీసియా, పీడియాట్రిక్స్, రేడియాలజిస్టులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో ఎక్కువ సంఖ్యలో నార్మల్ డెలివరీలు చేయడం అభినందనీయమన్నారు. గర్భిణికి ముందు నుంచే నార్మల్ డెలివరీ ఆవశ్యకతపై ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రతి గర్భిణికి టిఫా స్కాన్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఎంసీహెచ్‌లో మరిన్ని బెడ్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్ఎంవో నవీనా, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
