
ప్రధాని మన్‌కీబాత్ 122 వ ఎపిసోడ్‌ను సనత్‌నగర్‌లో కేంద్రమంత్రి ప్రజలతో కలిసి వీక్షించారు. మోదీ చెప్పిన విధంగా స్వచ్ఛత, యోగా, డయాబెటీస్ లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ...మన్ కీ బాత్... ప్రజలను జాగృతం చేస్తుందని ఐక్యంగా నిలబెడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.
ఉగ్రవాదులు దాడిచేస్తే ప్రతి దాడి చేస్తామనే విధంగా .. మోదీ ప్రభుత్వం చేసి చూపించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి గులాబీపూలతో.. క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించే విధానానికి మోదీ స్వస్తి చెప్పారని ... ఒక్కరిని చంపితే వంద మందిని చంపుతామనే విధంగా పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ ఉగ్ర మూకల శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఆపరేషన్ సింధూర్ తో గట్టి సందేశం..
ఆపరేషన్ సిందూర్ తో 9 ఉగ్రస్థావరాలను పాక్ భూభాగంలోకి చొరబడి మరీ ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఇందులో భారత సైనికుల పాత్ర కీలకమన్నారు. ఈ ఆపరేషన్ లో విశాఖకు చెందిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సమయంలో నిర్వహిస్తున్న తిరంగ యాత్రలు, ర్యాలీల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని దేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను కూడా అంబర్ పేట్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ముషీరాబాద్ లలో ర్యాలీలు నిర్వహించానని చెప్పారు. ఉగ్రదాడులపై పాక్ ‘కుక్క తోక వంకర’ అన్నట్లే ప్రవర్తిస్తే ఆ తోకనే కత్తిరించేస్తామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హెచ్చరించారు.