ఎర్ర జెండాతోనే సమస్యలు పరిష్కారం ..సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి

ఎర్ర జెండాతోనే సమస్యలు పరిష్కారం ..సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి

గద్వాల, వెలుగు: ఎర్ర జెండాతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని, దేశంలో రైతులు, కార్మికుల సమస్యలపై తమ పార్టీ నిరంతర పోరాటాలు నిర్వహిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సీపీఐకి వందేళ్లు నిండిన సందర్భంగా శనివారం గద్వాలలో ఎమ్మెల్సీ నెల్లకంటి సత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాల నరసింహాతో కలిసి రాష్ట్ర బస్సుజాతాను ప్రారంభించారు. 

అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్​రెడ్డి మాట్లాడారు. గద్వాలలో ప్రారంభమైన బస్సు యాత్ర కొత్తగూడెంలో ముగుస్తుందని చెప్పారు. కమ్యూనిస్టులు లేని దేశాల్లో పెట్టుబడిదారులదే రాజ్యం అవుతోందన్నారు. పాలకుల అరాచకాలను తిప్పికొట్టాలంటే కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యమన్నారు. డిసెంబర్ 26న భద్రాచలంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎప్పుడూ ప్రజల పక్షమే..

ఆసిఫాబాద్: సీపీఐ ఎప్పుడూ ప్రజల పక్షమేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు అన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ నుంచి శనివారం బస్సు జాతాను ఆయన ప్రారంభించారు. కుమ్రంభీం విగ్రహం, సమాధి వద్ద నివాళులు అర్పించారు. మ్యూజియాన్ని పరిశీలించారు. 

అనంతరం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ వందేళ్ల ప్రస్థానం వేడుకలు భద్రాచలంలో జరపాలని జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, కలవేన శంకర్, మారుపాక అనిల్ కుమార్, మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.