యుద్ధ భయం.. ఐపీఓలను వాయిదా వేస్తున్న కంపెనీలు

యుద్ధ భయం.. ఐపీఓలను వాయిదా వేస్తున్న కంపెనీలు

న్యూఢిల్లీ:  భారతదేశంలో వరుసగా రెండేళ్ల పాటు ఐపీఓలు రికార్డులు సృష్టించినా, యుద్ధం కారణంగా ఇప్పుడు దలాల్ స్ట్రీట్‌లో ఐపీఓల కరువు కనిపిస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు స్టాక్ మార్కెట్‌పై చూపుతున్న ప్రభావమే దీనికి ప్రధాన కారణం. ఐపీఓల కోసం ప్రయత్నిస్తున్న కంపెనీలు ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి. 

ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడం వల్ల వాల్యుయేషన్లపై స్పష్టత లేకుండా పోయింది.  కంపెనీలు ఈ క్వార్టర్‌‌లో పబ్లిక్​ఇష్యూల ద్వారా 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13,875 కోట్లు) సేకరించాయి. గత ఏడాది ఇదే సమయంలో 2.3 బిలియన్ డాలర్లు (రూ.21,275 కోట్లు) సేకరించడం గమనార్హం. 

ఆర్థిక మందగమనం ఆందోళనలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, రూపాయి బలహీనపడటం వంటివి ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఆసియా దేశాల మార్కెట్లతో పోలిస్తే భారతీయ స్టాక్ మార్కెట్లు వెనకబడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ బుధవారం 2.3 శాతం పడిపోయింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటికే నిఫ్టీ దాదాపు ఏడు శాతం నష్టపోయింది. రూపాయి విలువ తొలిసారి 92 స్థాయిని దాటి బలహీనపడింది. ఫలితంగా పలు కంపెనీలు తమ డీల్ సైజును తగ్గించుకోవాల్సి వస్తోంది. లిస్టింగ్ తర్వాత షేరు ప్రదర్శన కూడా నిరాశాజనకంగా ఉంటోంది.

తొమ్మిదిలో ఆరింటికి నష్టాలు

ఈ ఏడాది వచ్చిన తొమ్మిది ఐపీఓలలో ఆరు వాటి ఆఫర్ ధర కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం లిస్టయిన క్లీన్ మ్యాక్స్ ఎన్విరో సొల్యూషన్స్ లిమిటెడ్ అప్పుడే తన ఐపీఓ ధర కంటే 20 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. 

సెడెమాక్ మెకాట్రానిక్స్ లిమిటెడ్ రూ.1,352 కోట్ల ఐపీఓను బుధవారం ప్రారంభించింది. ఎన్​హెచ్‌ఏఐ ఇన్విట్ రూ.ఆరు వేల కోట్ల ఐపీఓ ఈనెల 11న ప్రారంభం కానుంది. బాగ్మనే ప్రైమ్ ఆఫీస్ ఆర్ఈఐటీ ఈ నెలలో రూ.4 వేల కోట్ల ఐపీఓకు ప్లాన్ చేస్తోంది. రాజపుతానా స్టెయిన్లెస్ లిమిటెడ్ మార్చి 9న చిన్న ఐపీఓను లాంచ్ చేయనుంది. 

ఫోన్ పే తన ఐపీఓ కోసం 9 నుంచి 10.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ను లక్ష్యంగా పెట్టుకుంది.  ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఐపీఓలలో దాదాపు రూ.ఏడు వేల కోట్లు పెట్టుబడి పెట్టారు.  తరువాత సుమారు రూ.21,200 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.