న్యూఢిల్లీ: రూమ్ ఎయిర్ కండిషనర్ల (ఏసీల) ధరలు పెరుగుతున్నాయి. కాపర్ ధరలు పెరగడం, రూపాయి విలువ పతనం, కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ నిబంధనలు, రవాణా ఖర్చులు పెరగడం వలన ధరలను 5–15 శాతం వరకు కంపెనీలు పెంచుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ధరల పెరుగుదలను అమలు చేస్తున్నాయి. డైకిన్ ఇండియా ఏప్రిల్ నుంచి 12శాతం వరకు ధరలు పెంచనుంది. బ్లూ స్టార్ ఇప్పటికే 8–10శాతం పెంచింది. వోల్టాస్ 5–15శాతం పెరుగుదల ప్రకటించింది.
ఎల్‌జీ 3-స్టార్ మోడళ్లకు 7శాతం, 5-స్టార్ మోడళ్లకు 9–10శాతం రేట్లు హైక్ చేసింది. హైయర్ 5–8శాతం పెంచగా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 5శాతం పెంచింది. కొత్త స్టార్ రేటింగ్ ఏసీలు 10–11శాతం ఎక్కువ ఎనర్జీ ఎఫిషియెన్సీ కలిగి ఉండటంతో కరెంట్ బిల్లు తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నాయి. రూమ్ ఏసీలపై జీఎస్‌టీ 28శాతం నుంచి 18 శాతానికి తగ్గడం వల్ల తాజాగా ధరలు పెరిగినా, కన్జూమర్లపై భారం ఎక్కువగా ఉండదని తెలిపాయి.
2025లో వర్షాల కారణంగా అమ్మకాలు తగ్గినా, ఈ సంవత్సరం తీవ్ర వేసవి అంచనాలతో అమ్మకాల్లో15శాతం వృద్ధి సాధ్యమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో రూమ్ ఏసీ మార్కెట్ సైజ్ ఏడాదికి సుమారు 1.35 కోట్ల యూనిట్లు ఉంటుంది. ఇందులో వోల్టాస్, ఎల్‌జీ, డైకిన్, బ్లూ స్టార్, హిటాచీ, పానాసోనిక్, లాయిడ్ వంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి.
