
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే టెండర్ నిబంధనలను ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థకు ఇంటర్ బోర్డు కాంట్రాక్ట్ అప్పగించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ అవకతవకల వెనుక పెద్ద మాఫియా ఉందన్నారు. కొన్ని ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు తమ స్టూడెంట్స్‌కు అనుకున్న మార్కులు వేయించుకొని ర్యాంకుల పంట పండించుకునేందుకు ఈ గ్లోబరీనా సంస్థను మేనేజ్ చేసుకుంటున్నాయని ఆరోపించారు. దీనిలో పది వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2016లో ఎంసెట్ పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించిన అప్పటి మాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థ, ఇప్పటి గ్లోబరీనా సంస్థ రెండింటి యజమానులు ఒక్కరేనన్నారు. కాకినాడ జేఎన్టీయూ ఫలితాల్లో ఈ రెండు సంస్థలు మోసం చేయడంతో అక్కడ కేసు నమోదైందని తెలిపారు. మాగ్నటిక్ సంస్థ యజమాని విజయరాం కొడుకు ప్రద్యుమ్న, కేటీఆర్ స్నేహితులని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2016 ఎంసెట్ లీకేజీలో నిందితులైన ఇద్దరు అనుమానాస్పదంగా మరణించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వ్యవహారాన్ని ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు 1996 లో అప్పటి ప్రభుత్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం నిర్వహించే ఈ సంస్థతో ఎలాంటి తప్పులు చోటుచేసుకునేవి కావన్నారు. కానీ ఈ బాధ్యతలను గుడ్ గవర్నెన్స్ నుంచి గ్లోబరీనాకు అప్పగించినప్పటి నుంచే తప్పులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. స్టూడెంట్స్‌కు సంబంధించిన డేటాను ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్, రీ పబ్లిష్ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి మంత్రులు బాధ్యులన్నారు. దేశాన్ని అట్టుడికించిన వ్యాపమ్ కుంభకోణం కంటే ఇంటర్ బోర్డు వ్యవహారం పెద్దదని తెలిపారు. కేటీఆర్ ఇప్పుడు మాట మార్చి గ్లోబరీనా అంటే తెలియదన్నట్లుగా మభ్యపెడుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాకినాడలో మోసం చేసిన సంస్థకే మళ్లీ టెండర్ ఎలా ఇచ్చారని, ఇది కేటీఆర్ కు తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు.
మళ్లీ ఆ సంస్థకే ఎట్లా ఇస్తారు?…
10 లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తును ఆందోళనలో పడేసిన గ్లోబరీనాకే మళ్లీ రీ కౌంటింగ్, రీ వాల్యూయేషన్ , రీ పబ్లిష్ చేసే అవకాశం ఎట్లా ఇస్తారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఆ సంస్థ మీద ఎందుకంత ప్రేమ అని నిలదీశారు. ప్రతి స్టూడెంట్ ఆన్సర్ షీట్‌ను ఆన్ లైన్ లో ఉంచాలని, ఇది తాను చేస్తున్న డిమాండ్ కాదని, ఇంటర్ బోర్డు నిబంధనలనే గుర్తు చేస్తున్నానని చెప్పారు. ఇంటర్ స్టూడెంట్స్ మరణానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై 304 ఏ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డుకు సంబంధించిన కాంట్రాక్టు నుంచి గ్లోబరీనాను వెంటనే తప్పించాలని, దాని యజమానులను అరెస్ట్ చేయాలని అన్నారు. చనిపోయిన ప్రతి స్టూడెంట్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నానని, బుధవారం సాయంత్రంలోగా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే గురువారం ఉదయం నుంచి గాంధీభవన్‌లో యూత్ కాంగ్రెస్ , ఎన్ ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహారదీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.