ఓఆర్ఆర్ స్కామ్​పై ఈడీ, సీవీసీకి  ఫిర్యాదు చేస్తం : రేవంత్ ​రెడ్డి

ఓఆర్ఆర్ స్కామ్​పై ఈడీ, సీవీసీకి  ఫిర్యాదు చేస్తం : రేవంత్ ​రెడ్డి
  • ఓఆర్ఆర్ స్కామ్​పై ఈడీ, సీవీసీకి  ఫిర్యాదు చేస్తం
  • లక్ష కోట్ల ఆస్తిని రూ.7 వేల కోట్లకే కట్టబెట్టారు: రేవంత్ ​రెడ్డి
  • రూల్స్​ను ఐఆర్ బీ ఇన్​ఫ్రా  ఉల్లంఘించింది
  • ఆ సంస్థ రేపటి కల్లా 10 శాతం అమౌంట్ కట్టాలె
  • డబ్బు కట్టకపోతే టెండర్ రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఓఆర్ఆర్ టెండర్​లో అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్​ఎన్ రెడ్డిపై ఈడీ, కాగ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ టోల్ ఎంత వస్తుంది, భవిష్యత్తులో ఎంత రానుంది, రాష్ట్ర సర్కార్ ఎంతకు టెండర్ ఇచ్చింది అనే అంశాలను విచారణ సంస్థలకు అందజేస్తామన్నారు. బుధవారం సీఎల్పీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పర్యవేక్షణలో ఓర్ఆర్ఆర్​ను తెగనమ్మారని ఆరోపించారు. చాలా తక్కువ ధరకు ఓఆర్ఆర్ టెండర్​ను ఐఆర్​బీకి అప్పగించారని పేర్కొన్నారు. అగ్గువకే టెండర్ కట్టబెట్టడమే కాకుండా ఇప్పుడు మరో దోపిడీకి తెరతీశారని తెలిపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ను ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా, వాయిదాల పద్ధతిలో చెల్లించేలా రూల్స్ మార్చాలని అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

“ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ పొందిన ఐఆర్ బీ ఇన్ ఫ్రా నెల రోజుల్లో మొత్తం అమౌంట్ లో 10 శాతం చెల్లించాలి. దీనికి ఈనెల 26 చివది తేదీ. టెండర్ వాల్యూ రూ.7380 కోట్లలో రూ.738 కోట్లు చెల్లించాలి. తాజాగా ఐఆర్ బీ ఇన్ ఫ్రా ఈ మొత్తం నెల రోజుల్లో చెల్లించకుండా గడువు ఇవ్వాలని హెచ్ఎండీఏ కి లేఖ రాసింది. రూల్ ప్రకారం ఈ నెల 26 వరకు 10 శాతం అమౌంట్ కట్టకపోతే టెండర్ ను రద్దు చేయాలి. ఈ తతంగంపై హెచ్ఎండీఏ కమిషనర్, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ వివరణ ఇయ్యాలే. నేను అపాయింట్ మెంట్ అడిగితే అధికారులు ఎందుకు ఇవ్వటం లేదు. ఆయన కేసీఆర్, కేటీఆర్ తాబేదారా” అని మండిపడ్డారు. ఇంత దోపిడీ జరుగుతున్నా బీజేపీ స్టేట్ ​చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రికి ఎందుకు లెటర్ రాయడం లేదని ప్రశ్నించారు.

దోపిడీ కోసం రిటైర్డ్​ ఆఫీసర్​ నియామకం

హెచ్​జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) ఎండీగా ఉన్న ఐఏఎస్ సంతోష్​ను టీఎస్​పీఎస్సీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్​గా బదిలీ చేసి, హడావుడిగా రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని నియమించారని రేవంత్ తెలిపారు. ఈ దోపిడీ కోసమే బీఎల్ఎన్ రెడ్డిని తీసుకొచ్చారని ఆరోపించారు. ఓఆర్ఆర్ టెండర్, లావాదేవీలపై తాను   ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగి ఎన్నో రోజులు అవుతున్నా ఇంత వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. సమాచారం ఇవ్వకుంటే హెచ్ఎండీఏ,  హెచ్​జీసీఎల్ ఆఫీసులను ముట్టడిస్తామన్నారు. 

సర్వే ఆధారంగానే టికెట్లు

కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని రేవంత్ అన్నారు. తన టికెట్ తో సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతల టికెట్లకు సర్వేనే ప్రామాణికమని, కర్నాటకలో ఇదే ఫార్ములా అమలైందన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పార్టీలో చేరే టైమ్​లో అ అంశం చర్చిస్తామన్నారు. ఎన్నికల టైమ్​లో పొత్తుల గురించి చర్చిస్తామన్నారు.

సింగపూర్​లో  కేటీఆర్​ గూడుపుటాని


‘‘టెండర్ దక్కిన తర్వాత ఐఆర్ బీ.. సింగపూర్ కంపెనీకి 49 శాతం వాటా అమ్మేసింది. ఇప్పుడు షెల్ కంపెనీలు ముందుకు వస్తాయి” అని రేవంత్ ​అన్నారు. “సింగపూర్ వెళ్లిన తేజరాజు, రాజేశ్​ రాజు, కేటీఆర్ ఎక్కడ ఉన్నారు. అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్న అన్నది పచ్చి అబద్ధం అని చెప్పారు. కేటీఆర్ గూడుపుటాని సమావేశాలు. షెల్ కంపెనీల వెనక ఉన్న రాజులు.. యువరాజులు ఎవరో తేలాలి” అని డిమాండ్ చేశారు.