యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంటు ప‌నులు పూర్తి చేయండి

యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంటు ప‌నులు పూర్తి చేయండి
  •  స‌మీక్షలో అధికారులకు భట్టి ఆదేశాలు

హైదరాబాద్‌, వెలుగు: యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నులు వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో యాదాద్రి థ‌ర్మల్ ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల పురోగ‌తిపై అధికారుల‌తో ఆయన స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడారు. నిర్దేశించిన గ‌డువు నాటికి పవర్‌ ప్లాంట్‌ ను పూర్తి చేసి ప్రజ‌లకు అందుబాటులోకి తీసుకురావాల‌ని సూచించారు. స్టేజ్‌–-1 లోని రెండు యూనిట్లు, స్టేజ్‌-–2లో నిర్మాణంలో ఉన్న మూడు యూనిట్ల పురోగ‌తి ప‌నులపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. రైల్వే ప‌నుల‌ను స‌మీక్షించి త్వరిత‌గ‌తిన పూర్తి చేసి బొగ్గు ర‌వాణాకు సంబంధించి లైన్‌ క్లియర్‌ చేయాలని చెప్పారు. 

ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు వ‌చ్చిన త‌ర్వాత చేప‌ట్టబోయే ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణీత కాలంలో పూర్తి చేయ‌డానికి త‌గిన ప్రణాళిక‌లు రూపొందించాలని జెన్‌కో అధికారుల‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా జెన్ కో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత మూడేండ్లుగా జరిగిన పనుల పురోగతిని వివరించారు. ఈ స‌మావేశంలో ఎనర్జీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స‌య్యద్ అలీ ముర్తజా రిజ్వీ, సదరన్‌ డిస్కం సీఎండీ ముషార‌ఫ్ అలీ ఫారుఖీ, డిప్యూటి సీఎం సెక్రటరీ  కృష్ణ భాస్కర్‌, జెన్ కో డైరెక్టర్లు స‌చ్చిదానందం, అజ‌య్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.